Begin typing your search above and press return to search.

హ‌రీశ్ తిరుగుబాటు!..ఖాయ‌మేనా?

By:  Tupaki Desk   |   24 April 2019 5:33 PM GMT
హ‌రీశ్ తిరుగుబాటు!..ఖాయ‌మేనా?
X
తెలంగాణ‌లో అధికార పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కీల‌క నేత‌గా ఎదిగిన ఆ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు మేన‌ల్లుడు త‌న్నీరు హ‌రీశ్ రావు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేస్తారా? అన్న దిశ‌గా చాలా కాలం నుంచే వార్త‌లు వినిపిస్తూ వ‌స్తున్నాయి. పార్టీ అధినేత‌గా కేసీఆర్ ఉన్నా... ఆయ‌న వెన్నంటి ఉండి పార్టీ ప‌నుల‌తో పాటు ఉద్య‌మ స‌మ‌యంలో కీల‌క ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టిన నేత‌గా హ‌రీశ్ రావు... తిరుగులేని నేత‌గానే ఎదిగారు. అంతేకాకుండా కేసీఆర్ అప్ప‌టిదాకా గెలుస్తూ వ‌స్తున్న సిద్దిపేట అసెంబ్లీ నుంచి తొలిసారి గెలిచిన హ‌రీశ్ రావు.. అక్క‌డ కేసీఆర్ కంటే కూడా తానే బ‌ల‌మైన నేత‌గా నిరూపించుకున్నారు. ఏటికేడు అక్క‌డ హ‌రీశ్ కు పెరుగుతూ వ‌స్తున్న మెజారిటీనే ఇందుకు నిద‌ర్శ‌నం. కేసీఆర్ మేన‌ల్లుడిగానే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హ‌రీశ్... వైరి వ‌ర్గాల్లోనూ మంచి పేరున్న నేత‌గా ఎదిగారు.

గ‌తంలో పార్టీలో నెంబ‌ర్ టూగా ఉన్న హ‌రీశ్.. ఎప్పుడైతే కేసీఆర్ త‌న కుమారుడు కేటీఆర్‌, కూతురు క‌విత‌ల‌ను రంగంలోకి దించేశారో, అప్పుడే తన ప్రాబ‌ల్యం త‌గ్గుతున్న‌ట్లుగా గుర్తించారు. పార్టీలో ప్రాధాన్యం త‌గ్గుతున్నా... జ‌నంలో మాత్రం హ‌రీశ్ కు తిరుగులేని నేత‌గానే పేరుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ బంప‌ర్ విక్ట‌రీ సాధించ‌గా... ఎన్నిక‌లు ముగియ‌గానే త‌న కుమారుడు కేటీఆర్ ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్ర‌క‌టించేసిన కేసీఆర్‌... మేన‌ల్లుడు హ‌రీశ్ ను మాత్రం ప‌క్క‌న‌పెట్టేశారు. మొన్న‌టి మంత్రివ‌ర్గ కూర్పులోనూ హ‌రీశ్ పేరు క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో త‌న‌కు పార్టీలో త‌గ్గుతున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన హ‌రీశ్... పార్టీపై తిరుగుబాటు చేసే అవ‌కాశాలు ఉన్నాయంటూ వార్త‌లు వ‌చ్చాయి. హ‌రీశ్ తిరుగుబాటు చేస్తే కూడా టీఆర్ఎస్ కొంప కొల్లేరు కావ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి.

ఇలాంటి త‌రుణంలో కేసీఆర్ ద‌గ్గ‌రి బంధువు ర‌మ్యారావు ఇప్పుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతానికి అయితే హ‌రీశ్ రావు తిరుగుబాటు చేసే అవ‌కాశాలేమీ లేవ‌ని చెప్పిన ఆమె... ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారితే మాత్రం హ‌రీశ్ తిరుగుబాటు ఖాయ‌మేన‌ని తేల్చేశారు. పార్టీలో మొద‌టి నుంచి ఉన్న నేత‌గా హ‌రీశ్ కు పార్టీపై మంచి ప‌ట్టే ఉంద‌ని, అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హ‌రీశ్ మేన‌మామ మాట‌ను జ‌వ‌దాటే ప‌రిస్థితి లేద‌ని వ్యాఖ్యానించారు. పార్టీలో హ‌రీశ్ కు త‌గ్గుతున్న ప్రాధాన్యాన్ని ప్ర‌స్తావించిన ర‌మ్యారావు... పార్టీలో హ‌రీశ్ కు ఎలా త‌గ్గింద‌న్న విష‌యాన్ని కూడా చాలా డీటైల్డ్ గానే వివ‌రించారు. టీడీపీ నుంచి కేసీఆర్ బ‌య‌ట‌కు రావ‌డం, ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మాన్ని భుజానికెత్తుకుని టీఆర్ఎస్ ను స్థాపించిన త‌రుణంలో అస‌లు ఆ పార్టీ నిల‌బ‌డుతుందా? అన్న కోణంలో అనుమానాలు వ్య‌క్తం చేసిన కేటీఆర్, క‌విత‌లు అమెరికాలోనే ఉండేందుకు ఇష్ట‌ప‌డ్డార‌ని తెలిపారు.

అయితే కాల‌క్ర‌మంలో ఉద్య‌మం ప‌తాక స్థాయికి చేర‌డం, టీఆర్ఎస్ కూడా అంత‌కంత‌కూ బ‌లోపేతం అవుతున్న విష‌యాన్ని ప‌సిగట్టేసి అమెరికా నుంచి తిరిగి వ‌చ్చార‌ని తెలిపారు. అయితే వారిలా కాకుండా హ‌రీశ్ ... మొద‌టి నుంచి కేసీఆర్ ను అంటిపెట్టుకునే ఉన్నార‌న్న విష‌యాన్ని కూడా ఆమె ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. త‌న‌కు పార్టీలో త‌గ్గుతున్న ప్రాధాన్యం హ‌రీశ్ కు అర్థ‌మైపోయినా... ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసే ప్ర‌స‌క్తి లేద‌ని, అయితే ప‌రిస్థితి మరింత‌గా దిగ‌జారితే మాత్రం హ‌రీశ్ తిరుగుబాటు చేయడం ఖాయ‌మేన‌ని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తంగా పార్టీలో వ్య‌వ‌హార‌మంతా ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నా... ర‌మ్యారావు చేసిన వ్యాఖ్య‌ల‌తో హ‌రీశ్ తిరుగుబాటు దిశ‌గా కొంత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌య్యే ప‌రిస్థితి అయితే క‌నిపిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.