Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: వివేక్ ఇంట్లో హరీశ్ రహస్య భేటీ?

By:  Tupaki Desk   |   1 Oct 2021 3:49 AM GMT
హాట్ టాపిక్: వివేక్ ఇంట్లో హరీశ్ రహస్య భేటీ?
X
టార్గెట్ ఇస్తే చాలు.. దాన్ని పూర్తి చేసే వరకు అలుపెరగకుండా లెక్కలు తేల్చే అలవాటున్న నేతగా మంత్రి హరీశ్ ను చెబుతారు. కేసీఆర్ అస్త్రంగా అభివర్ణించే మేనల్లుడిని ఎప్పుడు ఎలా వాడాలో గులాబీ బాస్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. టాస్క్ మాస్టర్ అన్న మాటకు సరిగ్గా సూట్ అయ్యే హరీశ్ కు తాజాగా కేసీఆర్ మరో టాస్కు అప్పజెప్పారా? అన్నది ప్రశ్నగా మారింది.రాజకీయ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆసక్తికర రాజకీయ పరిణామానికి తెర లేచినట్లుగా చెబుతున్నారు.

బీజేపీనేత వివేక్ వెంకటస్వామి ఇంటికి మంత్రి హరీశ్ రావు తాజాగా వెళ్లినట్లు చెబుతున్నారు. అత్యంత రహస్యంగా సాగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. వివేక్ వెంకటస్వామికి బలమైన సొంత మీడియా సంస్థ ఉందన్న విషయం తెలిసిందే. వీ6 చానల్ తో పాటు..వెలుగు పేపర్ కూడా ఆయనదే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత అస్త్రాన్ని సంధిస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని అమలు చేయటమే కాదు.. పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ ను ఎంపిక చేసుకోవటం తెలిసిందే.

అదే సమయంలో.. కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ.. వివేక్ మద్దతును హరీశ్ కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్న వివేక్.. పార్టీ కోసం తనశక్తి మేర సాయం చేస్తున్నా.. అందుకు తగిన గుర్తింపు లభించటం లేదన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల మంచి చెడ్డలు చూసుకోవటంలో వివేక కీలక భూమిక పోషించినట్లు చెబుతారు. ఇందుకు భారీగానే ఖర్చు పెట్టినట్లు సమాచారం.

అయినప్పటికీ ఎలాంటి పదవి రాకపోవటం.. ఆయన ఆశించిన రాజ్యసభ సీటును కేటాయించే విషయంలో సరైన హామీని ఇవ్వని నేపథ్యంలో.. ఆయన్ను గులాబీ కారు వైపు తిప్పేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళలో.. వివేక్ ను పార్టీ నుంచి తప్పించి.. టీఆర్ఎస్ తీర్థం కాని ఇప్పిస్తే.. సమీకరణాల్లో మార్పులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. దళిత నేతగా గుర్తింపు ఉన్న వివేక్ లాంటి నేత పార్టీలోకి తీసుకురాగలిగితే.. పరిణామాలు వేరుగా ఉంటాయన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇందులోభాగంగానే మంత్రి హరీశ్ ను వివేక్ ఇంటికి పంపినట్లుగా చెబుతున్నారు. ఈ సాయానికి బదులుగా ఆయన కోరుకుంటున్న రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. వివేక్ నిర్ణయం ఏమిటి? హరీశ్ ఇచ్చిన ఆఫర్ మీద ఏం చేయనున్నారు? వివేక్ ను గులాబీ కారులోకి తీసుకురావాలన్న కేసీఆర్ తాజా టాస్కు విషయంలోటాస్కు మాస్టర్ ఏం చేయనున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.