Begin typing your search above and press return to search.

సిద్ధిపేట‌లోనే హ‌రీశ్‌ కి షాక్

By:  Tupaki Desk   |   29 Dec 2015 6:01 AM GMT
సిద్ధిపేట‌లోనే హ‌రీశ్‌ కి షాక్
X
తెలంగాణ రాష్ర్ట స‌మితిలో, తెలంగాణ ప్ర‌భుత్వంలో చురుగ్గా వ్య‌వ‌హ‌రించే కీల‌క మంత్రి, సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావుకు షాక్ త‌గిలింది. అది కూడా ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన సిద్దిపేట‌లోనే కావ‌డం గ‌మ‌నార్హం. హ‌రీశ్‌ కు ఎదురైన సంఘ‌ట‌న‌తో ఎల్ల‌ప్పుడు సంయ‌మ‌నంతో ఉండే హ‌రీశ్ "మంత్రిని అయిన నాతోనే ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తారా?" అంటూ ఆవేశ‌ప‌డ్డారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

మెదక్ జిల్లా సిద్దిపేట మినీస్టేడియంలో వివిధ అభివృద్ధి పనులకు 2.1 కోట్లు మంజూరు చేశారు. స్టేడియంలో ఇండోర్ షటిల్ కోర్టు - లాంగ్ టెన్నిస్ - ఖోఖో - పుట్‌ బాల్ - కబడ్డీ - బాస్కెట్‌ బాల్ కోర్టులకు ఈ మొత్తం కేటాయించారు. మంత్రి హ‌రీశ్‌ రావును ప్రారంభోత్సవానికి పిలిచారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం క‌దా, పైగా నిధులు మంజూరు చేసి చాలా కాలం అయిన‌ నేప‌థ్యంలో ప‌నులు పూర్త‌యిపోయిందని భావించి హ‌రీశ్ ఓకే చెప్పి అక్క‌డికి వెళ్లారు. తీరా వెళ్లి చూసేస‌రికి... లాంగ్ టెన్నిస్ కోర్టు - బాస్కెట్‌ బాల్ కోర్టులు అసంపూర్తిగా ఉన్నాయి. కోర్టులో పోల్స్ - లైట్స్ ఏర్పాటు చేయలేదు. మినీస్టేడియం అభివృద్ధి పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వ‌దిలి పెట్టడం - పైగా త‌న‌కే బురిడీ కొట్టించేలా ప్రారంభోత్సవానికి పిల‌వ‌డంతో అధికారులపై హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హౌసింగ్ ఈఈ విజయ్‌ కుమార్‌ పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌నులు ఇలా పెట్టుకొని ఎందుకు పిలిచారని నిల‌దీశారు. 15 రోజులు ఇక్కడే మకాం వేసి స్టేడియంలో మిగిలిన పనులు త్వరగా చేయించాలని ఆదేశించారు. నిధులు తక్కువైతే తన దృష్టికి తీసుకువస్తే మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. పనుల్లో నాణ్యత లేకున్నా, పనుల చేయకున్నా..విధుల్లో నిర్లక్ష్యం వహించిన సస్పెండ్ చేస్తానని హౌసింగ్ ఈఈని హెచ్చరించి అభివృద్ధి పనులను ప్రారంభించకుండానే వెళ్లిపోయారు!

ఇదిలావుండగా, సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న బాలికల హాస్టల్ నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతుండడంపై మంత్రి హరీశ్‌ రావు అసంతృప్తి వ్యక్తం చేశా రు. హాస్టల్ పూర్తి చేయడానికి ఎన్ని నెలలు కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఇప్పటికి 20 సార్లు ఫోన్ చేసినా నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఆర్‌డబ్లుఎస్ డీఈ సారీ చెప్పేందుకు యత్నించినా ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పావని, సారీ అనే పదానికి అర్థం లేకుండా పోతోందన్నారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే, పైగా మంత్రి అయిన త‌న‌కే అధికారులు చుక్క‌లు చూపించ‌డం ఏంట‌ని సన్నిహితుల‌తో హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు.