Begin typing your search above and press return to search.

చంకలో ఉన్నప్పుడు ఈ దరిద్రాలేమీ కనిపించలేదా హరీశ్?

By:  Tupaki Desk   |   5 Sep 2021 5:30 AM GMT
చంకలో ఉన్నప్పుడు ఈ దరిద్రాలేమీ కనిపించలేదా హరీశ్?
X
మిగిలిన నేతలకు టీఆర్ఎస్ లోని కొందరు నేతలకు ఒక పెద్ద వ్యత్యాసం ఉంటుంది. అబద్ధం చెప్పినా అతికినట్లుగా చెప్పే టాలెంట్ గులాబీ పార్టీలో కొందరిలో మామూలుగా ఉండదు. కాలానికి తగ్గట్లు.. తాము అనుకున్న ఎజెండాకు తగ్గట్లుగా మాట్లాడి కన్వీన్స్ చేయటం కూడా ఎక్కువే. మొన్నటివరకు టీఆర్ఎస్ లో కీలక నేతగా.. తిరుగులేని తెలంగాణవాదాన్ని వినిపించే పెద్ద మనిషిగా ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ పార్టీకి.. గులాబీ నేతలకు ఎంత విలన్ గా కనిపిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటల రాజేందర్ ఓటమే తమ లక్ష్యంగాపని చేస్తోంది టీఆర్ఎస్. తమ ముందున్న ఈటల సవాల్ సంగతి చూడాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెప్పాలి. అందుకే.. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనల్ని చేస్తున్న హరీశ్.. ఏ చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టకుండా ఈటలపై ఘాటు విమర్శలు.. పదునైన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా హుజూరబాద్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని మరీ.. పలు సంక్షేమ కార్యక్రమాల్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.

తాజాగా హుజూరాబాద్ లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు హరీశ్ చేతుల మీదుగా రూ.1.25కోట్ల వడ్డీ లేని రుణాల్ని పంపిణీ చేయటం గమనార్హం. ఏడేళ్లుగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని తాను ప్రశ్నించటం తప్పు ఎందుకు అవుతుందన్నారు. ఒక్క మహిళా సంఘానికి భవనం నిర్మించి ఇవ్వలేదంటూ మండిపడ్డారు.

తాను ప్రశ్నలు సంధిస్తుంటే.. ఉలిక్కిపడుతున్నారని.. అనరాని మాటలు అంటున్నారని.. నోటికి వచ్చినట్లు తిట్టేట్లు చేస్తున్నారని హరీశ్ వాపోయారు. తనను తిట్టటం ఎంతవరకు సబబు అన్న విషయానికి ప్రజలే సమాధానం ఇస్తారని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం డబుల్ బెడ్రూం ఇల్లు కట్టినా.. హుజూరాబాద్ లో మాత్రం కట్టించలేదని అక్కడి మహిళలు చెబుతున్నట్లుగా హరీశ్ పేర్కొన్నారు. సైదాబాద్ - బోర్నపల్లిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. అందుకోసం రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదంతా చూస్తున్నప్పుడు.. ప్రతి నియోజకవర్గంలోని సమస్యలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పని తీరు తెలియాలంటే.. ఉప ఎన్నికలు వస్తే ఇట్టే అర్థమవుతాయని చెప్పాలి. ఏడేళ్లుగా అధికారంలో ఉన్నా.. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సినంత డెవలప్ మెంట్ జరగలేదన్న మాట వినిపించటం తెలిసిందే. ఉప ఎన్నికలు వచ్చి.. తమకు చెందిన ఈటల పరాయి అయినంతనే.. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోని లోటుపాట్లు హరీశ్ కు ఇంతలా కనిపిస్తున్నాయి. కానీ.. తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఈటలను.. ఆయన పని తీరును తప్పు పట్టేస్తున్న హరీశ్ కారణంగా ఇమేజ్ తర్వాత డ్యామేజ్ జరుగుతుందంటున్నారు. ఉప ఎన్నిక వచ్చే వరకు హుజూరాబాద్ పట్టని హరీశ్ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.