Begin typing your search above and press return to search.

5జీ నెట్‌వ‌ర్క్ తో ఆరోగ్యానికి హానికరమా .. నిజ‌మేంత‌, స్పష్టం చేసిన సీవోఏఐ !

By:  Tupaki Desk   |   7 Jun 2021 7:30 AM GMT
5జీ నెట్‌వ‌ర్క్ తో ఆరోగ్యానికి హానికరమా .. నిజ‌మేంత‌, స్పష్టం చేసిన సీవోఏఐ !
X
ఇండియా లో అతి త్వరలోనే 5జీ నెట్‌ వ‌ర్క్ అందుబాటులోకి రాబోతుంది. అయితే , 5జీ నెట్‌ వ‌ర్క్ త్వరలో రాబోతుంది అని వార్తలు వచ్చిన తర్వాత , దాని చుట్టూ గత కొన్ని రోజులుగా ఓ వివాదం జరుగుతుంది. భార‌త్‌ లో 5జీ టెక్నాల‌జీ ట్ర‌య‌ల్ ర‌న్ చేయ‌డం వ‌ల్లే క‌రోనా సెకండ్ ఈ రేంజ్‌ లో వ్యాపించింద‌ని గ‌తంలో కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే, వీటిలో ఏ మాత్రం నిజం లేద‌ని నిపుణులు స‌ద‌రు ఫేక్ వార్త‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే తాజాగా 5జీ టెక్నాల‌జీ ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం చూపుతుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది సెల్యులార్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ). ఇది ముమ్మాటికీ త‌ప్పుడు ప్రచార‌మ‌ని తేల్చి చెప్పింది.

5జీ టెక్నాల‌జీ చాలా సుర‌క్షిత‌మైంద‌ని, అన్ని ఆధారారాలు దీన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయ‌ని తెలిపింది. 5జీ టెక్నాల‌జీ రాక‌తో ఆర్థిక రంగంతో పాటు స‌మాజానికి అనే ప్ర‌యోజ‌నాలు జ‌రుగుతాయ‌ని సీవోఏఐ అభిప్రాయ‌ప‌డింది. అంతేకాకుండా, భారత్‌ లో టెలికాం రంగంలో విధించిన ఎలక్ట్రోమాగ్నటిక్‌ రేడియేషన్‌ పరిమితి, అంతర్జాతీయంగా ఆమోదించిన పరిమాణంలో పదో వంతు మాత్రమేనని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. ఇదిలా ఉంటే, దేశంలో 5జీ వైర్‌ లెస్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా పిటిషన్‌ ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. పిటిషన్‌ లోపభూయిష్టంగా ఉందంటూ ఆమెతో పాటు ఇద్దరు సహ పిటిషనర్లకు రూ.20 లక్షల జరిమానా విధించింది. హైకోర్టు తీర్పును ఎస్పీ కొచ్చర్‌ స్వాగతిస్తూ , ఇది వదంతులకు అడ్డుకట్ట వేస్తుందన్నారు.

రేడియో ఫ్రీక్వెన్సీని వినియోగించడం మొదలై శతాబ్దం కావస్తోంది. అయితే 5జీలోని రేడియో ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఎక్కువ. సుదూర ప్రాంతాలకు సైతం అది సరిగా అందాలంటే సెల్‌ టవర్లు ముమ్మరంగా వినియోగించాలి. కనుక జనాభాలో అత్యధికులు దీని ప్రభావానికి లోనుగాక తప్పదు. ఇప్పుడున్న సాంకేతికతల ఆధారంగా 5జీని కొలవడం సరికాదన్నదే నిపుణుల భావన. అందుకే దీని సంగతి త్వరగా తేల్చాలని ఈమధ్యే 44 దేశాలనుంచి 253మంది శాస్త్రవేత్తలు ఐఏఆర్‌ సీకి లేఖ రాశారు. మనుషుల్లోని నాడీమండల వ్యవస్థ, రక్తంలో కొన్ని రకాల రసాలను స్రవించే వినాళగ్రంధి వ్యవస్థ దెబ్బతింటాయన్నది వీరి ఆందోళన. బ్రిటన్‌ శాస్త్రవేత్తలైతే ప్రస్తుతానికి 5జీ అమలు వాయిదా వేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు.