Begin typing your search above and press return to search.

హర్షకుమార్ సంచలనం...ఆ కేసుల్లో జగన్ ప్రమేయముందా?

By:  Tupaki Desk   |   31 Jan 2020 4:30 PM GMT
హర్షకుమార్ సంచలనం...ఆ కేసుల్లో జగన్ ప్రమేయముందా?
X
నిజంగానే... ఈ ఆరోపణలు సంచలనమేనని చెప్పక తప్పదు. ఉమ్మడి ఏపీలో పెను కలకలం రేపిన టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య, నవ్యాంధ్రలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమేయం ఉందన్న అర్థం వచ్చేలా ఆరోపణలు చేస్తే.. సంచలనమే కదా. అదీ... ఓ సీనియర్ రాజకీయవేత్త - మాజీ ఎంపీ హోదా కలిగిన నేత నోట ఈ కామెంట్లు వచ్చాయంటే... మరింత సంచలనం కదా. అందుకే... సీఎం జగన్ పై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను కలకలమే రేపుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంపై ఓ రేంజిలో పోరు సాగించిన హర్షకుమార్... అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా... చాలా కాలం క్రితం ఆయనపై నమోదై.. ఇంకా క్లోజ్ కాని మరో కేసు బూజు దులిపిన పోలీసులు... అటు నుంచి అటే హర్షకుమార్ ను జైలుకు తరలించారు. ఎట్టకేలకు 40 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన హర్షకుమార్.. బెయిల్ పై రెండు రోజుల క్రితం విడుదలయ్యారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా హర్షకుమార్... జగన్ సర్కారు తనపై కక్షసాదింపునకు దిగిందని ఆరోపించారు.

తాజాగా శుక్రవారం మరోమారు మీడియా ముందుకు వచ్చిన హర్షకుమార్... జగన్ పై సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న ఆరోపణలు చేశారు. పరిటాల రవీంద్ర హత్య సమయంలో నిందితులకు జగన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సరఫరా చేశారని హర్షకుమార్ ఆరోపించారు. అంతేకాకుండా పరిటాల హత్య కేసులో నిందితుడిగా అరెస్టై జైలులో ఉన్న కొండారెడ్డి.. నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి దయతో సీబీఐ కనుసన్నల నుంచి తప్పించుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగకపోవడానికి కూడా జగనే కారణమని కూడా హర్షకుమార్ ఆరోపించారు. అంటే... అటు పరిటాల రవీంద్ర హత్య, ఇటు వివేకా హత్య కేసుల్లో జగన్ కు ప్రమేయం ఉందన్న రీతిలో డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా హర్షకుమార్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.