Begin typing your search above and press return to search.

జనసేనలో చేరాలనుకున్నా....కానీ, పవన్ అలా చేశాడు:హర్ష కుమార్

By:  Tupaki Desk   |   5 Oct 2020 5:33 PM GMT
జనసేనలో చేరాలనుకున్నా....కానీ, పవన్ అలా చేశాడు:హర్ష కుమార్
X
మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ హర్షకుమార్ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు జనసేనలో హర్షకుమార్ చేరబోతున్నారంటూ ముమ్మర ప్రచారం జరిగింది. అయితే, చివరకు హర్షకుమార్ జనసేనలో చేరలేదు. హర్షకుమార్ ను పార్టీలో చేర్చుకోవడం పవన్ కల్యాణ్ కు ఇష్టం లేదని, అయితే, చివరి వరకు ఈ విషయాన్ని పవన్ నాన్చడంతో హర్షకుమార్ నిరుత్సాహ పడ్డారని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ విషయంపై హర్షకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పవన్ పార్టీలోకి ఆహ్వానిస్తారన్న ప్రచారం నిజమేనని, ఆ తర్వాత ఏమైందో తెలియదని, పవన్ తనను ఆహ్వానించకపోవడంతో సైలెంట్ అయ్యానని హర్షకుమార్ అన్నారు. తన వల్లే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం రెండు జిల్లాల్లో ఓటమిపాలైందని హర్షకుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు. బహుశా పవన్ అభద్రతా భావానికి లోనై ఉంటారని, అందుకే తనను పార్టీలో చేర్చుకోలేదని హర్షకుమార్ అన్నారు.

జనసేనకు వెళితే బాగుంటుందని, కొత్తగా వచ్చాడు పవన్ అని అనుకున్నాని హర్షకుమార్ చెప్పారు. తాను జనసేన పార్టీలో చేరాలనుకున్నందునే తన వర్గం నుంచి ఎంతో మందిని ఆ పార్టీలోకి పంపించానని హర్షకుమార్ చెప్పారు. హర్ష కుమార్ పెద్ద లీడర్..ఆయనను స్వయంగా కలవాలి అని జనసేనలో ప్రతిఒక్కరితో పవన్ అనేవారని హర్ష కుమార్ తెలిపారు. చివరివరకు పవన్ వస్తారనుకున్నా....రాలేదని ఆ తర్వాత తాను కూడా సైలెంట్ అయ్యానని అన్నారు. హర్షకమార్ కు బలం తగ్గిందని ఎవరూ అనుకోలేరని, రెండుసార్లు ఎంపీగ గెలిచిన తన గురించి ఆ రకంగా ఎవరూ ఆలోచించరని అన్నారు. పవన్ తో భేటీ జరగలేదని, ఇండిపెండెంట్ గా పెట్టే స్థోమత లేక...ఏ పార్టీలోనూ చేరడం ఇష్టం లేక సైలెంట్ అయ్యానని అన్నారు. ఇపుడు పవన్ పిలిచి టికెట్ ఇస్తానన్నా వెళ్లనని, పవన్ తనకు ఏరకంగాను సరిపోయే వ్యక్తి కాదని చెప్పారు. పవన్ కు జనాకర్షణ, అభిమానులు ఉండొచ్చని, కానీ, ఆయన అపుడపుడు వస్తాడని, ఎన్నికల ముందు వేరే పార్టీకి సపోర్ట్ చేయండి అంటాడని షాకింగ్ కామెంట్లు చేశారు. తాను నిరంతం పాలిటిక్స్ లో ఉంటానని, కాబట్టి ఇద్దరికీ సెట్ అవదని అన్నారు.