Begin typing your search above and press return to search.

ఆ రెండు కేసుల్లో బాబా రాంపాల్ కు విముక్తి!

By:  Tupaki Desk   |   29 Aug 2017 10:45 AM GMT
ఆ రెండు కేసుల్లో బాబా రాంపాల్ కు విముక్తి!
X
దేశంలో దొంగ బాబాల గోల మరింతగా ఎక్కువవుతోందన్న వాదన వినిపిస్తోంది. మొన్న నిత్యానంద - నిన్న సంత్ రాంపాల్ - నేడు డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ - ఆ మధ్యలో మరింత ఆసక్తి రేకెత్తించిన లేడీ బాబా రాధేమా... వెరసి దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బాబాల ముసుగులేస్తున్న దొంగ బాబాలు జనాల నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టేసుకుని కోట్లకు పడగలెత్తుతున్నారు. అంతేనా జనంలోని దైవ భక్తిని ఆసరా చేసుకుని వారిని నిలువునా దోచేస్తున్నారు. ఫక్తు నేరగాళ్లు కూడా పాల్పడని రీతిలో సొమ్ములతో పాటు ఆయా తమను నమ్మి వచ్చిన కుటుంబాల్లోని మహిళల మాన ప్రాణాలను కూడా దోచేస్తున్నారు.

అయినా మన న్యాయవ్యవస్థ ఇప్పుడు చాలా బాగా పనిచేస్తున్న క్రమంలో ఇకపై ఈ దొంగ బాబాల ఆటలు చెల్లవని అనుకున్నాం కదా అంటే... న్యాయ వ్యవస్థ బాగానే ఉంది. సదరు బాబాలు పాల్పడుతున్న అక్రమాలను పోలీసులు కొన్ని సంద‌ర్భాల్లో నిరూపించ‌లేక‌పోవ‌డంతో దొంగ బాబాలు చాలా సులువుగా బయటపడిపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. అదే త‌ర‌హాలో మూడేళ్ల క్రితం త‌న ఆశ్ర‌మంలో అనుచ‌రుల‌తో నానా రచ్చ చేసి జైలుకు వెళ్లిన‌ సంత్ రాంపాల్ అనే దొంగ బాబాకు కూడా శిక్ష ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, ఆ అల్ల‌ర్ల‌కు సంబంధించి అత‌డిపై న‌మోదైన రెండు క్రిమిన‌ల్ కేసుల‌లో రాంపాల్ ను కోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించింది. అత‌డిపై మ‌రో హ‌త్య‌కేసు స‌హా ఇత‌ర కేసులు పెండింగ్ లో ఉండ‌డంతో అత‌డిని జైలులోనే య‌థాత‌థంగా కొనసాగించాల‌ని కోర్టు తెలిపింది.

వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు బాబా రాంపాల్ ను హర్యానాలోని హిస్సార్ కోర్టు రెండు క్రిమిన‌ల్ కేసుల‌లో నిర్ధోషిగా నిర్ధారించింది. మూడేళ్ల కిందట బల్వారాలో జరిగిన అల్లర్ల కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించారు కూడా. రాంపాల్ పై అల్లర్ల‌ను ప్రేరేపించ‌డం, ప్ర‌భుత్వ అధికారుల విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డం, వారిని గాయ‌ప‌ర‌చ‌డం, హ‌త్యా నేరం వంటి అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో, 2014 నుంచి రాంపాల్ హిస్సార్ సెంట్ర‌ల్ జైలులో జైలు జీవితం గ‌డుపుతున్నారు. బాబా రాంపాల్ పై అల్లర్ల‌ను ప్రేరేపించ‌డం, ప్ర‌భుత్వ అధికారుల విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డం వంటి క్రిమిన‌ల్ కేసుల‌లో ఆరోపణలను రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో, ఆ రెండు క్రిమిన‌ల్ కేసుల‌లో రాంపాల్ ను నిర్ధోషిగా కోర్టు నిర్ధారించింది. హ‌త్యానేరంతో పాటు మిగిలిన కేసులు పెండింగ్ లో ఉండ‌డంతో రాంపాల్ జైలు జీవితం కొన‌సాగ‌నుంది. ఆయ‌నను హిసార్ లోని సెంట్ర‌ల్ జైలులోనే కొన‌సాగించ‌నున్నారు.