Begin typing your search above and press return to search.

ఓటు వేసేందుకు సైకిల్ మీద వచ్చిన సీఎం

By:  Tupaki Desk   |   21 Oct 2019 6:58 AM GMT
ఓటు వేసేందుకు సైకిల్ మీద వచ్చిన సీఎం
X
మహారాష్ట్ర.. హర్యానా రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీ.. అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కీలకమైన మహారాష్ట్ర.. హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ రెండు రాష్ట్రాల పోలింగ్ మీదనే అందరి ఫోకస్ ఉందని చెప్పాలి. ఈ రోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ సాగనుంది.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు.. హర్యానాలో 90 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే.. పోలింగ్ సందర్భంగా ఆసక్తికర పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఓట్లు వేసేందుకు బారులు తీరారు. అనూహ్యంగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోలింగ్ బూత్ కి సైకిల్ మీదకు వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన తిరిగి వెళ్లారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటు వేసేందుకు సైకిల్ తొక్కుకుంటూ రావటం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన సతీమణి అమృతతో పాటు తల్లి సరిత నాగపూర్ లోని పోలింగ్ బూత్ లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో బలమైన రాజకీయ కుటుంబాల్లో ప్రముఖమైన శరద్ పవార్ కుటుంబ సభ్యులంతా కలిసి ఓటు వేయటానికి వచ్చి.. ఫోటోలు దిగటంతో సందడి నెలకొంది. మరో బలమైన కుటుంబమైన థాకరే ఫ్యామిలీ కూడా ఓట్లు వేశారు.

ఈసారి ఎన్నికలప్రత్యేకత ఏమంటే.. థాకరే కుటుంబం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆదిత్య ఠాక్రే.. ఓటు వేయటానికి ముందు తన తాత.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఆశీర్వాదం తీసుకోవటంతో పాటు.. సిద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ఓటు వేశారు. మరో బీజేపీనేత దుష్యంత్ చౌతాలా తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రాక్టర్ మీదకు పోలింగ్ బూత్ కు చేరుకొని ఓటు వేయటం చూపురులను ఆకర్షించింది.

రెండు రాష్ట్రాల్లోనూ పలువురు రాజకీయ.. సినీ.. క్రీడాకార ప్రముఖులు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపారు. సినీ ప్రముఖులు జెనీలియా - రితేష్‌ దేశ్‌ముఖ్‌ - రవి కిషన్‌ - కిరణ్‌ రావ్‌ - అమీర్‌ ఖాన్‌ - మాధురి దీక్షిత్‌ లు వివిధ పోలింగ్‌ బూత్‌ ల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి.. ఆయన సతీమణి లారా దత్తాలు ముంబయిలో ఓటు హక్కును నిర్వహించుకున్నారు. ఇలా పలువురు ప్రముఖులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు.