Begin typing your search above and press return to search.

ఢిల్లీ కాలుష్యంపై ఇద్ద‌రు సీఎంల చిత్ర‌మైన వాద‌న‌

By:  Tupaki Desk   |   14 Nov 2017 4:20 AM GMT
ఢిల్లీ కాలుష్యంపై ఇద్ద‌రు సీఎంల చిత్ర‌మైన వాద‌న‌
X
గ‌డిచిన కొద్దిరోజులుగా దేశ రాజ‌ధానిలో వాతావ‌ర‌ణ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. తీవ్ర‌మైన వాయుకాలుష్యం నేప‌థ్యంలో ఢిల్లీ వాసులు బ‌య‌ట‌కు వ‌స్తే చాలు వారు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. అలా బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఓ అర‌గంట పాటు వీధుల్లో తిరిగితే చాలు.. త‌ల తిర‌గ‌టం.. ముక్కులు మండ‌టం.. క‌ళ్లు ఎరుపెక్క‌టం లాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాలంటూ ఇప్ప‌టికే ఢిల్లీ రాష్ట్ర స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది.

వాయుకాలుష్యంతో పాటు వాతావ‌ర‌ణం సైతం అనుకూలంగా లేక‌పోవ‌టంతో కాలుష్య మేఘాలు ఢిల్లీ మ‌హాన‌గ‌రం నుంచి ముందుకు క‌ద‌ల‌ని దుస్థితి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కాలుష్యం వెనుక స‌వాల‌చ్చ కార‌ణాలు ఉంటే.. ఇద్ద‌రు సీఎంలు మాత్రం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌ట‌మే కాదు.. మ‌రో ముఖ్య‌మంత్రిపై ఆరోప‌ణ‌లు ఎక్కు పెట్ట‌టం గ‌మ‌నార్హం.

ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిన నేప‌థ్యంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ.. హ‌ర్యానా.. పంజాబ్ రైతులు త‌మ పొలాల్లో నిప్పు పెట్ట‌టం వ‌ల్లే భారీ కాలుష్యానికి కార‌ణంగా వ్యాఖ్యానించారు.దీనిపై హ‌ర్యానా ముఖ్య‌మంత్రి.. బీజేపీ నేత ఖ‌ట్ట‌ర్ స్పందిస్తూ.. త‌మ రాష్ట్రంలో 40వేల మంది మాత్ర‌మే రైతులు ఉన్నార‌ని.. వారికి ఇప్ప‌టికే పొలాల్లో నిప్పు పెట్టొద్ద‌ని చెప్పామ‌ని.. త‌మ కార‌ణంగా ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ అయ్యింద‌న‌టం స‌రికాద‌న్నారు. తాను సోమ‌వారం.. మంగ‌ళ‌వారాల్లో ఢిల్లీలోనే ఉంటాన‌ని.. కాలుష్యంపై మాట్లాడాలంటే తాను సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

దీనికి క్రేజీవాల్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. దీనిపై ఖ‌ట్ట‌ర్ రియాక్ట్ అవుతూ.. త‌మ‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని.. తాను ఢిల్లీలో ఉంటాన‌ని.. మాట్లాడుకుందామ‌ని చెప్పినా కేజ్రీవాల్ నుంచి ఎలాంటి స్పంద‌న లేద‌ని.. నిజానికి ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్ రాష్ట్ర రైతులు కార‌ణం కావొచ్చంటూ హ‌ర్యానా ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లు చేశారు.

ఢిల్లీ వాతావ‌ర‌ణ కాలుష్యానికి స‌వాల‌చ్చ రీజ‌న్స్ ఉన్నాయి. అయితే.. వాటిని వ‌దిలేసి రైతుల్ని బాధ్యులుగా చేయ‌టం స‌రికాదు. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ మ‌ధ్య‌నున్న రాజ‌కీయ విభేదాల నేప‌థ్యంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు సంధించుకోవ‌టం ఒక ఎత్తు. మ‌ధ్య‌లో మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రిపైనా.. ఆ రాష్ట్ర రైతుల పైనా వ్యాఖ్య‌లు చేయ‌టం చూస్తే.. దీని వెనుక రాజ‌కీయం ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అమ్ ఆద్మీ పార్టీకి నేతృత్వం వ‌హిస్తుండ‌గా.. హ‌ర్యానా ముఖ్య‌మంత్రి బీజేపీ.. పంజాబ్ ముఖ్య‌మంత్రి కాంగ్రెస్‌ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ వాయుకాలుష్యాన్ని సాకుగా చేసుకొని అన‌వ‌స‌రంగా రైతుల్ని ఈ ఇష్యూలోకి లాగుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.