Begin typing your search above and press return to search.

సోనియాను అంత మాట అనేసిన పెద్దాయన!

By:  Tupaki Desk   |   14 Oct 2019 10:16 AM GMT
సోనియాను అంత మాట అనేసిన పెద్దాయన!
X
వయసులో పెద్ద. రాజకీయ అనుభవం ఎక్కువే. ఆయన స్థానం కూడా తక్కువేం కాదు. ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పెద్ద మనిషిగా ఉండి కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడటంలో ఆయనకు మించినోళ్లు ఉండరన్న పేరుంది. చాలా మంది ముఖ్యమంత్రుల నోటికి దురుసుతనం ఎక్కువైనా.. మహిళల్ని.. మహిళా నేతల్ని ఉద్దేశించి మాట్లాడే సమయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారు.

కానీ.. ఘనత వహించిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కు మాత్రం ఆడోళ్లంటే అలుసన్న రీతిలో ఆయన మాటలు ఉంటాయి. ఆర్టికల్ 370 నిర్వీర్యం వేళ.. కశ్మీరీ మహిళల్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కశ్మీరీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటమే కాదు.. మీ అమ్మాయిల్ని కూడా మేం ఇలానే మాట్లాడేస్తే మీరేం అంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం తాము అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటానికి బిహార్ వెళ్లేవాళ్లమని.. ఆర్టికల్ 370 నిర్వీర్యం నేపథ్యంలో కశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లాడొచ్చంటూ మనసు గాయపడేలా మాట్లాడారు.

అమ్మాయిలు అంటే ఆట బొమ్మలన్నట్లుగా.. నచ్చిన వారిని పెళ్లి చేసుకోవటానికి వారికి మనసు అన్నది లేనట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శ ఉంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన నోట వచ్చే మాటలకు హద్దు ఆపు లేకుండా పోతోంది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని తూలనాడుతూ.. పరుష వ్యాఖ్యలు చేస్తూ నోరు జారారు.

ఆమెను చచ్చిన ఎలుకతో పోల్చారు. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్షపదవికి రాహుల్ రాజీనామా చేశారని.. గాంధీయేతర వ్యక్తులే కొత్త అధ్యక్షుడి పగ్గాలు చేపడతారని చెబితే.. తాము మంచిదేనని అనుకున్నట్లు చెప్పారు. అయితే.. అధ్యక్షుడి కోసం మూడు నెలలు దేశమంతా గాలించి.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా.. చచ్చిన ఎలుకను అధ్యక్ష స్థానానికి ఎంపిక చేశారని.. ఆ పార్టీ పరిస్థితి అలా ఉందంటూ నోరు జారారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా.. నోటి మాటలతో కెలికి వివాదాలు తెచ్చుకోవటం ఎన్నికల వేళ నష్టమన్న విషయం ఆయనకు అర్థమయ్యేలా హర్యానా ప్రజలు తీర్పు ఇచ్చే బాగుంటుందన్న మాట వినిపిస్తుండటం గమనార్హం.