Begin typing your search above and press return to search.

కారు లేదు..చేతిలో రూ.15వేలు..ఆ సీఎం ఆస్తుల లెక్కలివి!

By:  Tupaki Desk   |   2 Oct 2019 5:36 AM GMT
కారు లేదు..చేతిలో రూ.15వేలు..ఆ సీఎం ఆస్తుల లెక్కలివి!
X
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రుల బ్యాగ్రౌండ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్. ఆయన ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. బ్యాచిలర్ అయిన ఆయనకు సొంత కారు లేకపోగా.. చేతిలో కేవలం రూ.15వేలు క్యాష్ మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఉన్నట్లుండి ఆస్తుల లెక్కలు చెప్పాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిందంటారా?

ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు. దీంతో పాటు తన ఆస్తి.. అప్పులకు సంబంధించిన వివరాల్ని అఫిడవిట్ లో పొందుపర్చారు. 65 ఏళ్ల ఖట్టార్ తాజాగా బీజేపీ అభ్యర్థిగా కర్నాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.

ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాల్లో తన ఆస్తుల విలువ రూ.1.27 కోట్లుగా పేర్కొన్నారు. అందులో రూ.94 లక్షలు చరాస్తులుగా పేర్కొన్నారు. స్థిరాస్తుల విలువ కేవలం రూ.33 లక్షలుగా ఆయన వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2014 ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన ఆఫిడవిట్ లో ఆయన తన ఆస్తుల్ని రూ.8.29 లక్షలుగా పేర్కొన్నారు. ఐదేళ్ల వ్యవధిలో ఆయన ఆస్తుల విలువ రూ.94లక్షలకు పైనే పెరిగినట్లుగా వెల్లడించారు.

రాష్ట్రంలోని రోహ్ తక్ జిల్లాలోని తన సొంత గ్రామం బినాయినిలో రూ.30లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమితో పాటు 800 చదరపు అడుగుల ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ఇంటి బహిరంగ మార్కెట్ విలువ రూ.3లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

తనకు సొంత వాహనం లేదని ఆయన వెల్లడించారు. తాను ఢిల్లీ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు చెప్పిన ఆయన.. తనకు ఎలాంటి బకాయిలు.. కేసులు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటికి సంబందించి అద్దె బకాయిలు మొదలు.. తాగునీరు.. విద్యుత్.. టెలిఫోన్ ఛార్జీలకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవని చెప్పారు. మొత్తానికి పెద్దమనిషి చాలా క్లియర్ గా ఉన్నారన్న మాట. అంతా బాగుంది కానీ.. ఐదేళ్లలో చరాస్తుల విలువ అంత భారీగా ఎలా పెరిగాయి ఖట్టర్ సాబ్?