Begin typing your search above and press return to search.

రూ.2.5కోట్లు తీసుకున్నాకా.. ట్వీట్ తో షాక్

By:  Tupaki Desk   |   5 March 2017 10:09 AM GMT
రూ.2.5కోట్లు తీసుకున్నాకా.. ట్వీట్ తో షాక్
X
సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎప్పుడు ఎవరేం చేస్తారో అర్థం కాని పరిస్థితి. తమ మాటల్ని కోట్లాది మందికి పంచుకునే క్రమంలో.. కొందరు ప్రముఖులు చేస్తున్న వ్యవహారాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమేకాదు.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రియోలో జరిగిన ఒలింపిక్స్ లో పతకం సాధించిన ఓవరైనైట్ స్టార్ గా మారిపోయారు రెజ్లర్ సాక్షి మాలిక్.

పతకాల పట్టికలో దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వేళ.. సాక్షి మాలిక్ సాధించిన పతకంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారతావని పండగ చేసుకుంది. ఈ సందర్భంగా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఒలింపిక్స్ లోపతకం సాధించి వారిపై వరాల జల్లులు కురిపించారు. రెజ్లర్ సాక్షి మీద కూడా అలానే వరాల జల్లు కురిపించింది హర్యానాలోని బీజేపీ సర్కారు. ఆమెకు రూ.2.5కోట్ల ప్రోత్సాహక నగదు పురస్కారంతో పాటు.. ఇంటి స్థలం.. ఉద్యోగం.. వగైరా.. వగైరా అంటూ చాలానే హామీల్ని ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభుత్వం తనకు ఇస్తానన్న నగదు పురస్కారం ఇవ్వలేదంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది సాక్షి మాలిక్. దీంతో.. హర్యానా ముఖ్యమంత్రి మీద తీవ్ర విమర్శలు పెల్లుబికాయి. హామీలు ఇచ్చి నెరవేర్చటానికి ఏమైందంటూ మండిపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలో హర్యానా సర్కారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో రియాక్ట్ అయిన హర్యానా మంత్రి అనిల్ విజ్.. తాము చెప్పినట్లే రూ.2.5కోట్ల చెక్కును సాక్షికి ఇచ్చినట్లుగా చెప్పారు. అంతేకాదు.. ఆమె కోరినట్లుగా ఒక ఉద్యోగాన్ని కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు.

మంత్రి ప్రకటన అనంతరం సాక్షి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.2.5కోట్ల చెక్కు ఇచ్చిన మాట వాస్తవమే అయినా.. మిగిలిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదంటూ ఆయన తీస్తున్న లా పాయింట్ విన్న వారంతా ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముందేమో.. రూ.2.5కోట్ల మొత్తాన్ని నిలిపివేశారంటూ చెప్పి.. ఆ తర్వాత మాట మార్చిన వైనం చూసినప్పుడు.. తనకు రావాల్సిన వాటిని వసూలు చేసుకునే విషయంలో సాక్షికి ఉన్న టాలెంట్ మామూలు కాదన్నది అర్థమవుతుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/