Begin typing your search above and press return to search.

రెండు రోజులు కలిసి ఉన్నా సహజీవనమే.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 May 2020 3:30 AM GMT
రెండు రోజులు కలిసి ఉన్నా సహజీవనమే.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X
యువతీయువకులు రెండు రోజులు కలిసి ఉన్నా.. అది సహజీవనం కిందకే వస్తుందంటూ ఆ రాష్ట్రాల హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు..కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. కలిసి ఉన్న తన ప్రియురాలిని.. వారి ఇంటి వారు తీసుకెళ్లిపోయారంటూ ఒక యువకుడు దాఖలు చేసిన పిటిషన్ విచారణ వేళ.. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలీ వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు ఏమిటి? ఏ పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసింది? లాంటి విషయంలోకి వెళితే..

ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి ఒక ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. అయితే.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా తన నుంచి దూరం చేసి తీసుకెళ్లినట్లుగా పేర్కొంటూ పంజాబ్.. హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన సింగిల్ బెంచ్ సీరియస్ అయ్యింది. ఆ యువతితో ఆ కుర్రాడు సహజీవనం చేస్తున్నాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేయటంతో పాటు.. యువతి ఫ్యామిలీ పరువు తీశారంటూ రూ.లక్ష ఫైన్ వేశారు. దీంతో.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అప్పీలుకు కోరారు.

తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు డివిజనల్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేమికులు రెండు రోజులు కలిసి ఉన్నా.. అది సహజీవనం కిందకే వస్తుందని పేర్కొన్నారు. అయితే.. తన ప్రియురాల్ని తనకు అప్పగించాలన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎందుకంటే.. సదరు యువకుడి వయసు ఇరవై ఏళ్లు మాత్రమే కావటం.. పెళ్లి చేసుకోవాలంటే కనీసం 21 ఏళ్లు పూర్తి చేసుకోవాలన్న విషయాన్ని గుర్తు చేసింది. ఆ కుర్రాడి విన్నపాన్ని హైకోర్టు విభేదించినా.. ఈ సందర్భంగా చేసిన ‘సహజీవనం’ వ్యాఖ్య మాత్రం కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.