Begin typing your search above and press return to search.

ఆవు కోసం హాస్ట‌ళ్ల‌తో స‌ర్కారు కొత్త ఆలోచ‌న‌

By:  Tupaki Desk   |   25 Oct 2017 6:17 PM GMT
ఆవు కోసం హాస్ట‌ళ్ల‌తో స‌ర్కారు కొత్త ఆలోచ‌న‌
X
స‌హ‌జంగా విద్యార్థులు కోసం హాస్టళ్లుండటం ఇంతవరకు మనకు తెలుసు. కానీ, జంతువుల కోసం అందులోనూ ఆవుల కోసం మ‌న‌కు తెలియ‌దు క‌దా? అదే అనుభ‌వం త్వ‌ర‌లో రానుంది. తొలిసారి ఆవుల కోసం హాస్టళ్లు నెలవబోతున్నాయి. వినడానికి వింతలా ఉన్నా ఇది నిజమే. బీజేపీ పాలిత రాష్ట్రమైన హ‌ర్యానాలో ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. హర్యానాలోని ప్రధాన నగరాల్లో 50-100 ఎకరాల విస్తీర్ణంలో ఆవుల పెంపకం కోసం 'పీజీ హాస్టల్స్‌' పేరిట వసతి గృహాలను నిర్మించబోతున్నామంటూ ఆ రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ఓంప్రకాశ్‌ ధాంకర్‌ వెల్లడించారు.

ఆవుల కోసం హాస్ట‌ల్ రూపొందించాల‌నే ప్ర‌తిపాద‌న‌ను పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత హిసార్‌ పట్టణంలో పీజీ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి ఓంప్రకాశ్‌ ధాంకర్ వివరించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆవుల పెంపకం చేపట్టి.. పాలను ఉత్పత్తి చేయడానికి ఈ హాస్టళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. అంతేకాక హాస్టళ్లలో ఆవులతో పాటు గేదెలను కూడా పెంచాలని యోచిస్తున్నట్టు చెప్పారు. అయితే ప్రభుత్వ ప్రయత్నాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 'మనుషుల కోసం హాస్టళ్లుంటాయి. ఆవుల కోసం హాస్టళ్లేమిటి? నగరాల్లో జనం నివాసముండేందుకే స్థలం లేదంటే.. హాస్టళ్లెక్కడ నిర్మిస్తారు? కేవలం ప్రచారం కోసం ప్రభుత్వం వేసిన ఎత్తుగడ ఇది' అని ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ) నేత అభరు చౌతాలా విమర్శించారు.