Begin typing your search above and press return to search.

ట్రంప్ అమెరిక‌న్లను బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   6 Jan 2019 7:02 AM GMT
ట్రంప్ అమెరిక‌న్లను బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారా?
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంత కాలం త‌న విధానాల‌తో...సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో విదేశీయుల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, ఇరకాటంలో ప‌డేయ‌గా ఇప్పుడు ఏకంగా అమెరికన్ల‌ను ఆందోళ‌నకు గురుచేస్తున్నారా? మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించేందుకు నిధులు ఎపిసోడ్ పేరుతో అగ్ర‌రాజ్యం దిశ‌ను ప్ర‌భావితం చేసే నిర్ణ‌యం తీసుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో.

మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించేందుకు నిధుల కేటాయింపు వివాదం మూలంగానే అమెరికాలో ప్రభుత్వ పాలన రెండు వారాలుగా స్తంభించిపోయింది. గోడ నిర్మాణానికి ట్రంప్ 560 కోట్ల డాలర్లు కోరుతుండగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు ససేమిరా అంటున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక ప్రతిష్టంభనను తొలిగించేందుకు ట్రంప్ శుక్రవారం సాయంత్రం డెమోక్రాట్ సభ్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో చట్టసభ అనుమతి లేకుండా మెక్సికో సరిహద్దులో గోడ కట్టేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తానని సభ్యులను హెచ్చరించినట్టు ట్రంప్ విలేకరులకు తెలిపారు. నిధులివ్వకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ చట్టసభ సభ్యులను బెదిరించారు. తన మాట నెగ్గించుకొనేందుకు అవసరమైతే నెలలు కాదు ఏండ్లయినా సరే ప్రభుత్వాన్ని మూసివేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు.

అంతకుముందు సెనేట్‌ లో మైనారిటీల నాయకుడు చక్ షూమర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని పనిచేయించాల్సిందిగా కోరామన్నారు. ఇంకా అనేక విషయాలు చర్చించామని, వాటిలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయని, చర్చలు కొనసాగుతాయని చెప్పారు. అయితే ప్రభుత్వం పనిచేయనంత వరకు చర్చలు పురోగతి సాధించడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ, డెమోక్రాట్ల ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకున్నామని, అయితే ప్రభుత్వం పనిచేయకుండా ఏదీ పరిష్కారం కాదని అన్నారు. అమెరికన్ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని మూసివేసైనా తాను పనిచేయగలనని త‌న మొండి త‌నాన్ని చాటుకున్నారు.