Begin typing your search above and press return to search.

రాజాసింగ్ ను బీజేపీ వదిలేసిందా ?

By:  Tupaki Desk   |   2 Sep 2022 4:41 AM GMT
రాజాసింగ్ ను బీజేపీ వదిలేసిందా ?
X
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. గోషామహల్ నుండి బీజేపీ ఎంఎల్ఏగా గెలిచిన రాజాసింగ్ మొదటి నుంచి వివాదాస్పదుడే. నోటికేదొస్తే అది మాట్లాడేయటమే. ముస్లింలకు వ్యతిరేకంగా, ఎంఐఎం నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటమంటే ఎంఎల్ఏకి అసలు ఒంటిమీద స్పృహే ఉండదు. ఇలాంటి చేష్టలతోనే చివరకు ఎంతో అనుబంధమున్నా పార్టీ నుండి సస్పెండ్ కాక తప్పలేదు.

పార్టీ నుండి సస్పెండ్ అయ్యే నాటికే ఎంఎల్ఏ మీద సుమారు 101 క్రిమినల్ కేసులు నమోదయ్యున్నాయి. వీటిలో దాదాపు 20 కేసులు మతపరమైన కేసులంటేనే ఈయనకు నోటి దురుసు ఎంతుందో అర్ధమైపోతోంది. ఎంతసేపు ముస్లింలను తిట్టడం, మత ఘర్షణలకు ఆజ్యం పోసేట్లుగా మాట్లాడటమే రాజాసింగ్ వ్యవహారంగా ఉండేది.

ఈయన పద్దతి మార్చుకోమని పార్టీ అగ్రనేతలు ఎంత చెప్పినా వినలేదు. చివరకు ఆగష్టునెలలో హైదరాబాద్ లో జరిగిన మునావార్ స్టాండప్ కామెడీ షో విషయంలో చేసిన అతివల్లే పార్టీనుండి సస్పెండ్ అయ్యారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రాజాసింగ్ ను పార్టీ సస్పెండ్ చేసినపుడు పార్టీ నేతలు ఒక్కరు కూడా మద్దతుగా మాట్లాడలేదు. అలాగే మహ్మద్ ప్రవక్తపై నోటికొచ్చింది మాట్లాడిన కారణంగా ఎంఎల్ఏపై పీడీ యాక్టు పెట్టి అరెస్టు చేసినపుడూ నేతలెవరూ మద్దతుగా మాట్లాడలేదు.

ప్రస్తుతం జైలులోనే ఉన్న ఎంఎల్ఏని పరామర్శించేందుకు కూడా నేతలెవరూ వెళ్ళలేదని సమాచారం. మహ్మాద్ ప్రవక్తకు వ్యతిరేకంగా రాజాసింగ్ మాట్లాడిన పదినిముషాల వీడియో కారణంగా సీనియర్ నేతలెవరూ మద్దతివ్వటానికి కూడా లేకుండా పోయింది.

చివరి విషయం ఏమిటంటే తన దూకుడు స్వభావం వల్ల పార్టీలోని సీనియర్ నేతల్లో చాలామందితో రాజాసింగ్ కు ఏమాత్రం పడటం లేదని సమాచారం. 2018 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద గెలిచిన ఏకైక ఎంఎల్ఏగా పేరు రావటంతో రాజాసింగ్ లో అహంకారం విపరీతంగా పెరిగిపోయిందని పార్టీలోనే చర్చ బాగా నడిచింది. అక్కడి నుండి చాలామందితో విభేదాలొచ్చాయట. ఈ కారణం వల్ల కూడా ఇపుడు నేతలెవరు రాజాసింగ్ వైపు కనీసం తొంగికూడా చూడటం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.