Begin typing your search above and press return to search.

ఏపీలో కమలానికి అభ్యర్థులు కావలెను!?

By:  Tupaki Desk   |   17 Feb 2019 6:02 AM GMT
ఏపీలో కమలానికి అభ్యర్థులు కావలెను!?
X
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అటు అట్టు కాకుండా ఇటు ముక్క కాకుండా అయిపోయింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని సొంతంగా ఎదగాలనుకున్న భారతీయ జనతా పార్టీ కల నెరవేరలేదు. నాలుగున్నరేళ్లు తమ మాట విన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కమలం నాయకులపై కన్నెర్ర చేశారు. దీంతో భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరిగిపోయింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.తాము సొంతంగా ఎదగడం మాట రాముడెరుగు. ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులే దొరికే పరిస్థితి లేకుండా పోయింది. శాసనసభకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు రావడంతో రెండు సభలకు కలిపి 200 మంది అభ్యర్థులు కావాల్సిన పరిస్థితి ఎదురైంది.

గత ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తు వల్ల కొన్ని స్థానాల్లోనే పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్ అంతటా తమ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. వారి ఆలోచన బాగానే ఉన్నా ఏపీలో పోటీ చేసేందుకు మాత్రం భారతీయ జనతా పార్టీ కి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఎదురయింది. ఎవరో ఒకరిని నిలబెట్టి పరువు కాపాడుకోవాలని అనుకున్నా పోటీ చేసేందుకు ఏపీ బిజెపి నాయకులు ముందుకు రావడం లేదని అంటున్నారు. సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవనే భయం కమలనాథుల్లో గూడు కట్టుకుంది. అధిష్టానం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా చక్రం తిప్పాలని గట్టి పట్టుదలగా ఉంది. ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక వ్యక్తిగా ఉండే ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కావడంతో ఇక్కడ సరైన నాయకత్వం లోపించిందని కమలనాథులు లోలోపల మదనపడుతున్నారు. రానున్న ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీకి అభ్యర్ధులు దొరకడం లేదని ఆ పార్టీ నాయకులే బహిరంగ చర్చల్లో అంగీకరించడం కొసమెరుపు.