Begin typing your search above and press return to search.

అప్పు చేసి ప‌ప్పు కూడు అంటే ఇదేనేమో?

By:  Tupaki Desk   |   9 Jan 2019 8:50 AM GMT
అప్పు చేసి ప‌ప్పు కూడు అంటే ఇదేనేమో?
X
ఎక్క‌డైనా రుణ మాఫీ అంటే... ఏ మిగులు నిధుల‌తోనో, లేదంటే ఇత‌ర‌త్రా ఆదాయ వ‌న‌రుల‌ను కొత్త‌గా సృష్టించి చేస్తారు. కానీ టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడి రూటే స‌ప‌రేటు క‌దా. ఇత‌రుల‌కు భిన్నంగా చేయ‌డ‌మే బాబు నైజం. ఆ భిన్న‌త్వం ఏ మేర ఉంటుంద‌న్న‌ది ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి మారుతూ ఉంటుంది. చివ‌ర‌కు రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కోసం చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్న వ్యూహం చూస్తే ఈ వ్యాఖ్య‌లు నిజ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రైతుల రుణ‌మాఫీ కోసం చంద్ర‌బాబు స‌ర్కారు ఏకంగా కొత్త‌గా అప్పులు చేస్తార‌ట‌. ఈ కొత్త అప్పు ఎక్క‌డ పుడుతుందా? అన్న విష‌యంపై ఈ నెల 21 నుంచి వెదుకులాట ప్రారంభిస్తార‌ట‌. ఇదే జ‌రిగితే... రైతుల రుణ మాఫీ కోసం చంద్ర‌బాబు స‌ర్కారు చేస్తున్న అప్పు మొత్తం రాష్ట్ర ప్ర‌జ‌ల నెత్తిపైనే ప‌డుతోంద‌న్న మాట‌. ఈ దిశ‌గా చంద్ర‌బాబు స‌ర్కారు నేల విడిచి సాము చేస్తున్న వైనం పై ఆర్థిక వేత్త‌లు ఇప్ప‌టికే గ‌గ్గోలు పెడుతున్నా... ముంద‌డుగు వేసేందుకే బాబు స‌ర్కారు సిద్ధ‌మైన‌ట్లుగా తెలుస్తోంది.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రైతుల రుణాల‌తో పాటు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల‌ను కూడా మాఫీ చేస్తానంటూ భారీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన చంద్ర‌బాబు... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌నుకున్న విజయాన్ని త‌న‌వైపు లాగేసుకున్నారు. రైతు రుణ మాఫీ పై హామీ మ‌నం కూడా ఇస్తే బాగుంటుంద‌ని వైసీపీ నేత‌లు పోరినా... అమ‌లు సాధ్యం కాని హామీలు ఇవ్వ‌డం ద్వారా వ‌చ్చే అధికారం త‌న‌కు వ‌ద్దంటూ జ‌గ‌న్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించేశారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి పై ప‌క్కాగా అంచ‌నాలు ఉండి కూడా కేవ‌లం అధికారం కోసం చంద్ర‌బాబు రుణ మాఫీ హామీ ఇచ్చేశారు. కేంద్రంలో అధికారం చేప‌డుతుంద‌ని భావించిన త‌న మిత్ర‌ప‌క్షం, ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... రుణ మాఫీ తాము హామీ ఇవ్వ‌లేమ‌ని కుండ‌బ‌ద్లు కొట్టినా... కేవ‌లం అధికారాన్ని చేజిక్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ఈ వాగ్దానాన్ని చేశారు. ఆ త‌ర్వాత రుణ మాఫీ ఎలా అమ‌లైంద‌న్న విష‌యం, ఎంత‌మందికి మాఫీ జ‌రిగింది? ఎవ‌రికి జ‌రిగింది? అన్న విష‌యాల‌పై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేకెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే మూడు ద‌ఫాలుగా విడ‌త‌ల‌వారీ రుణ మాఫీ అమ‌లు చేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... ఇప్పుడు నాలుగు, ఐదో విడ‌త‌ల రుణ‌మాఫీకి సిద్ధ‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే ఐదు విడ‌త‌ల రుణ‌మాఫీ అమ‌లు కావాల్సి ఉన్నా... ఎప్ప‌టిక‌ప్పుడు దానిని వాయిదా వేసుకుంటూ వ‌స్తున్న చంద్ర‌బాబు... ఎన్నిక‌ల‌కు గ‌డువు త‌రుముకు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఒకే ద‌ఫా రెండు విడ‌త‌ల రుణ మాఫీని విడుద‌ల చేయ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ల‌బ్ధి పొందేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించుకుంటున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఈ రెండు విడ‌త‌ల రుణ‌మాఫీ నిధుల కోసం చంద్ర‌బాబు స‌ర్కారు ఏకంగా అప్పు చేసేందుకు నిర్ణ‌యం తీసేసుకుంది. మూడో విడ‌త రుణ మాఫీ కోస‌మే రూ.2 వేల కోట్ల‌ను అప్పుగా తీసుకున్న బాబు స‌ర్కారు... ఇప్పుడు నాలుగు, ఐదో విడ‌త‌ల రుణ‌మాఫీ కోసం ఏకంగా రూ.8,100 కోట్ల‌ను అప్పుగా తీసుకునేందుకు సిద్ధ‌మైపోయింది. అంటే రైతు రుణ మాఫీ కోసం ఏకంగా చంద్ర‌బాబు స‌ర్కారు మొత్తంగా రూ.10,100 కోట్లను అప్పుగా తీసుకున్న‌ట్ట‌వుతుంద‌న్న మాట‌. మ‌రి రైతు రుణ మాఫీ కోసం తెచ్చే అప్పు ఎవ‌రి నెత్తిన ప‌డ‌నున్న‌ట్లు? ప‌్ర‌జ‌ల నెత్తిపైనే క‌దా. మ‌రి రైతుల రుణాల మాఫీ కోసం అప్పులు చేస్తున్న ప్ర‌భుత్వం... రైతుల‌తో పాటు మొత్తం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అప్పుల్లోకి నెట్టేస్తున్న‌ట్టే క‌దా.