Begin typing your search above and press return to search.

కాపు ఓట్ల కోసం వాళ్ల‌ను బ‌లి చేస్తున్న బాబు!

By:  Tupaki Desk   |   22 Jan 2019 9:03 AM GMT
కాపు ఓట్ల కోసం వాళ్ల‌ను బ‌లి చేస్తున్న బాబు!
X
ఇత‌రులు చేసిన మంచి ప‌నుల‌ను త‌న ఘ‌న‌త‌లుగా చెప్పుకోవ‌డంలో చంద్ర‌బాబు నాయుడు ముందుంటార‌ని చెబుతుంటారు విశ్లేష‌కులు. హైద‌రాబాద్ ను తానే అభివృద్ధి చేశాన‌ని.. తెలుగు రాష్ట్రాల‌కు సెల్‌ ఫోన్ తానే తీసుకొచ్చాన‌ని.. అబ్దుల్ క‌లాంను తానే రాష్ట్రప‌తిని చేశాన‌ని ఆయ‌న చెప్పే మాట‌లే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఉద‌హ‌రిస్తుంటారు. తాజాగా ఇలాంటి ప‌రిణామ‌మే మ‌రొక‌టి చోటుచేసుకుంటోంద‌ని వారు సూచిస్తున్నారు.

ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల కోసం కేంద్ర‌ప్ర‌భుత్వం ఇటీవ‌ల విద్య‌, ఉద్యోగ రంగాల్లో ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ ను అమ‌ల్లోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. దాన్ని ఆమోదించుకోవ‌డం లేదా ఆమోదించుకోక‌పోవ‌డం లేదా కోటాలో మార్పులు చేసుకోవ‌డం వంటి అధికారాన్ని రాష్ట్రాల‌కు కేంద్రం క‌ట్ట‌బెట్టింది. ఈ అధికారాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం దుర్వినియోగం చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈడ‌బ్ల్యూఎస్ 10 శాతం కోటాపై చంద్ర‌బాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ సోమ‌వారం చ‌ర్చించింది. రాష్ట్రంలో ఈ కోటాను వ‌ర్తింప‌జేయ‌డంలో మార్పులు చేయాల‌ని నిర్ణ‌యించింది. మొత్తం 10 శాతం కోటాలో 5 శాతాన్ని కేవ‌లం కాపుల‌కే కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. మిగ‌తా 5 శాతాన్ని రెడ్డి, కమ్మ, రాజు, బ్రాహ్మణ వంటి మిగిలిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

చంద్ర‌బాబు కేబినెట్ నిర్ణ‌యంపై కాపుయేత‌ర అగ్ర‌వ‌ర్ణాల వారు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతున్నారు. నిజానికి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు గ‌తంలో మాట ఇచ్చారు. కానీ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలేవీ చేయ‌లేదు. ఇప్పుడు మోదీ ద‌య‌తో 10 శాతం కోటా అగ్ర వ‌ర్ణ పేద‌ల‌కు ద‌క్కి నేప‌థ్యంలో దాన్ని త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం చంద్ర‌బాబు విభ‌జిస్తున్నార‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. రిజ‌ర్వేష‌న్ విష‌యంలో మాట త‌ప్పిన చంద్ర‌బాబుపై కాపులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. దీంతో ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని ఆయ‌న ప‌సిగ‌ట్టార‌ని వివ‌రిస్తున్నారు. అందుకే ఈడ‌బ్ల్యూఎస్ కోటాలో 5 శాతాన్ని కాపుల‌కు మ‌ళ్లించి.. అదేదో త‌న ద‌య‌తోనే ద‌క్కిన‌ట్లు ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నంలో చంద్ర‌బాబు ఉన్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న కుతంత్రాన్ని కాపుయేత‌ర అగ్ర‌కులాల వారు క‌చ్చితంగా అర్థం చేసుకుంటార‌ని.. టీడీపీకి త‌గిన బుద్ధి చెప్తార‌ని జోస్యం చెప్తున్నారు.