Begin typing your search above and press return to search.

చంద్రబాబు రెండు పడవల ప్రయాణం.. రెండింటికీ చెడ్డ రేవడేనా?

By:  Tupaki Desk   |   13 Feb 2019 5:57 AM GMT
చంద్రబాబు రెండు పడవల ప్రయాణం.. రెండింటికీ చెడ్డ రేవడేనా?
X
ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా రెండు లక్ష్యాలతో రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఒకటేమో... ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం.. అంటే తానే మళ్లీ అధికారంలోకి రావడం. రెండోది.. ఎలాగైనా నరేంద్ర మోదీ ప్రధాని కాకుండా అడ్డుకోవడం. అంటే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడం, ఒకవేళ ఆ అవకాశం లేకుంటే ఇతర పార్టీల నుంచి ఇంకెవరైనా కూడా ఓకే అనడం. ఇందుకోసం ఆయన ఏపీ, దిల్లీ, ఇతర రాష్ట్రాల మధ్య కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఇలాంటి రాజకీయ ఎత్తుగడలతో రెండింటికీ చెడ్డ రేవడి కావడం తప్పదన్నభయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.

చంద్రబాబు ప్రధాన రాజకీయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్. కానీ, ఆయన అక్కడే కాకుండా అంతటా అడుగుపెడుతూ రాజకీయం చేస్తున్నారు. అలా అని ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరించే సత్వర, బృహత్తర ప్రణాళికలేమీ అమలు చేయడం. పోనీ.. ప్రధాని పదవికి ట్రై చేస్తున్నారా అంటే ఆ కోరికా కనిపించడం లేదు. కానీ... అన్నిట్లో వేలు పెట్టడం మాత్రం మానడం లేదు. దానికి కారణం.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయనను అనుకూలంగా ఉండేవారిపై వ్యతిరేకత. ఇంకా చెప్పాలంటే పగ. పక్క రాష్ట్రంలో తన కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్న ఒకప్పటి తన పార్టీలోని నేత కేసీఆర్‌ తో బయటకు చెప్పని పోటీ. రాజకీయ అసూయ. ఇవన్నీ చంద్రబాబును ఏపీలోని కుదురుగా ఉండనివ్వకుండా చేస్తున్నాయి.

గత ఏడాది డిసెంబరులో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు అక్కడ కేసీఆర్‌ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో తెగ పనిచేశారు. తాను, తన సైన్యం మొత్తాన్నీ మోహరించారు. అయితే.. చంద్రబాబు కమాన్ కమాన్ అంటూ కొట్టిన క్లాప్స్ వీలైఛెయిర్‌ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాళ్లకు ఏమాత్రం బలాన్ని ఇవ్వలేకపోయాయి. పార్టీ నుంచి వెళ్లిపోయినా వ్యక్తిగతంగా తన చెప్పుచేతుల్లోనే ఉన్న రేవంత్ రెడ్డి... కూకట్‌ పల్లిలో నిలబెట్టిన కుటుంబ అబ్యర్థి సుహాసిని కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది. కానీ... ఆయన ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు.

తెలంగాణ ఎన్నికలకు ముందు కర్నాటక సమరం సమయంలోనూ చంద్రబాబు ఒకసారి మెరిశారు. అందులో ఆయనేమీ యాక్టివ్ రోల్ పోషించకపోయినా అక్కడ బీజేపీ అధికార సాధనలో విఫలం కావడంతో ఆనందంతో తాండవం చేశారు. కర్నాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకార సమయంలోనే తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షు రాహుల్ గాంధీతో భుజం భుజం కలిపి కనిపించారు.

మొన్నటికి మొన్న బెంగాల్‌ లో మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహిస్తే దానికీ వెళ్లి ఉపన్యసించారు. ఆ తరువాత తమపై సీబీఐ ద్వారా కేంద్రం దాడి చేస్తోందంటూ మమత నిరాహార దీక్ష చేస్తే అక్కడికీ వెళ్లారు చంద్రబాబు. మమతకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిందీ ఆయనే.

ఆ తరువాత మొన్న ఫిబ్రవరి 11న దిల్లీలో ఏపీ ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్ష. దేశంలోని చాలా పార్టీల నుంచి నేతలు వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. అది జరిగిన మరునాడే ఏపీ వెళ్లిన చంద్రబాబు 24 గంటలు కూడా తిరక్క ముందే మళ్లీ కేజ్రీవాల్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు దిల్లీ వస్తున్నారు. వీటన్నిటి లక్ష్యం ఒక్కటే కేంద్రంలో మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ప్రధాని కాకూడదు. బీజేపీ గెలవకూడదు.

అయితే.. చంద్రబాబు ఇవన్నీ చేస్తున్న వేళ.. ఇతర రాష్ట్రాలు, దిల్లీకి చక్కర్లు కొడుతున్న వేళ రాష్ట్రంలో పరిస్థితులు ఏమైనా చంద్రబాబుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయా అంటే సమాధానం దొరకదు. చంద్రబాబు సొంత సర్వేలే ఇప్పటికీ ఆయన్ను మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు తీసుకెళ్లడం లేదు.

మరోవైపు ఆయన వద్దనుకుంటున్న జగన్ గత 14 నెలల పాటు పాదయాత్రం చేసి.. పూర్తిగా జనంలోనే ఉంటూ రాష్ట్రం దాటి బయటకు పోకుండా జనం బాధలు తెలుసుకుంటూ, జనంలోనే ఉంటూ వారి మెప్పు పొందారు. ఇప్పుడు సమర శంఖారావం అంటూ మరోసారి జనంలోకి వెళ్తున్నారు. జగన్‌ కు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు అడ్డూఅదుపూ లేకుండా హామీలిస్తున్నా కూడా ఆశించిన మైలేజ్ రావడం లేదు. ఇదంతా చాలదన్నట్లు పవన్ కల్యాణ్ కూడా హ్యాండిచ్చారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో గట్టెక్కుతామా లేదా అన్న భయం టీడీపీ నేతల్లో ఉంది. కానీ, తమ నాయకుడు మాత్రం ఇలాంటి కీలక సమయంలో రాష్ట్రంపై పూర్తి దృష్టి పెట్టడం మానేసి జాతీయ రాజకీయాలపై దృష్టిపెడుతుండడంతో ఆయన ఏం కొంప ముంచుతాడోనని టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. చంద్రబాబు రెండు పడవల ప్రయాణమేమో కానీ రెండింటికీ చెడ్డ రేవడి కావడం ఖాయమన్న మాటలు టీడీపీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.