Begin typing your search above and press return to search.

ఈసీ ఆ నిర్ణ‌యం తీసుకుంటే మీడియాకు పెద్ద దెబ్బే!

By:  Tupaki Desk   |   30 Jan 2019 8:24 AM GMT
ఈసీ ఆ నిర్ణ‌యం తీసుకుంటే మీడియాకు పెద్ద దెబ్బే!
X
ఎన్నిక‌ల్ని ఎంత ప‌క‌డ్బందీగా జ‌రిపినా.. పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు మాత్రం వ‌స్తూనే ఉన్నాయి. ఎన్నిక‌ల్ని మ‌రింత క‌ట్టుదిట్టంగా నిర్వ‌హించే ప‌నిలో భాగంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ఒక ఆలోచ‌న చేస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న కానీ అధికారిక‌మైతే మీడియాకు భారీ షాక్ గా మారుతుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం అమ‌లు అవుతున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం రాజ‌కీయ పార్టీలు.. ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు.. వారి స‌న్నిహితులు.. స్నేహితులు.. సానుభూతిప‌రులు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టం తెలిసిందే. ఎన్నిక‌ల్లోకీల‌క‌మైన పోలింగ్ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి.. పోలింగ్ కు 48 గంట‌ల నుంచి టీవీల్లో ఎలాంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌కూడ‌ద‌న్న నిబంధ‌న ఉంది. అదే స‌మ‌యంలో ప్రింట్ కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ప్ర‌చారం చేసుకునే వెసులుబాటు ఉంది.

ఇదిలా ఉంటే.. టీవీ చాన‌ళ్ల‌కు ఒక నిబంధ‌న‌.. ప్రింట్‌.. డిజిట‌ల్ మీడియాకు మ‌రో రూల్ ఎందుక‌న్న చ‌ర్చ ఇప్పుడు న‌డుస్తోంది. ఎన్నిక‌ల్ని మ‌రింత పాద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌టంతో పాటు.. ఎవ‌రి మీద ఎలాంటి ప్ర‌భావం చూప‌ని రీతిలో అన్ని ర‌కాల ప్ర‌చారాల్ని నిలిపివేస్తే ఎలా ఉంటుంద‌న్న అంశంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది.

త‌న‌కొచ్చిన ఆలోచ‌న‌ను అమ‌లు చేసేందుకు వీలుగా కేంద్ర న్యాయ‌మంత్రిత్వ శాఖ‌కు ఈ ప్ర‌తిపాద‌న‌ను లేఖ రూపంలో తెలియ‌జేసింది. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 126 కింద ఉన్న రూల్ ప్ర‌కారం విస్త‌రించాల‌ని ప్ర‌తిపాదించింది. ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎల‌క్ట్రానిక్ మీడియాలో మాత్ర‌మే పోలింగ్‌కు 48 గంట‌ల ముందు నిషేధం ఉంది. దాన్ని ప్రింట్‌.. ఎల‌క్ట్రానిక్ మీడియాలోనూ విస్త‌రించాల‌ని కోరింది.

ఇదిలా ఉంటే.. ఈ రెండింటితో పాటు సోష‌ల్ మీడియాలోనూ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముకుతాడు వేయాల‌న్న ఆలోచ‌న‌లో ఈసీ ఉంది. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియాలో ప్ర‌చురిత‌మ‌య్యే పోస్టుల‌ను స్కానింగ్ చేయాల‌ని భావిస్తోంది. అంతేకాదు.. పోలింగ్‌కు 48 గంట‌ల ముందు రాజ‌కీయ పార్టీల ప్ర‌క‌ట‌న‌ల‌ను బ్లాక్ చేసే అవ‌కాశాన్ని చూడాలంటూ ఫేస్ బుక్ లాంటి సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల సంఘం లేఖ రాసిన‌ట్లుగా చెబుతున్నారు.