Begin typing your search above and press return to search.

మోడీలో భయం మొదలైందా?

By:  Tupaki Desk   |   9 July 2021 8:30 AM GMT
మోడీలో భయం మొదలైందా?
X
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏకంగా 70కు పైగానే ఎంపీ సీట్లు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఇదీ. ఇక్కడి జనాభా చాలా పాశ్చాత్యా దేశాల కంటే కూడా ఎక్కువ. అంత పెద్ద రాష్ట్రంలో అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలోకి రావడం ఈజీ. యూపీ ప్రజల తీర్పునే దేశంలో అధికారంలోకి ఎవరు వస్తారన్నది డిసైడ్ చేస్తుంది.

గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడిన నేతలందరినీ పక్కనపెట్టి ఎంపీ, యోగి అయిన ఆధిత్యనాథ్ ను సీఎం సీట్లో కూర్చుండబెట్టింది బీజేపీ అధిష్టానం. అయితే ఆయన దూకుడు, హిందుత్వ విధానాలు, కరోనా ఫెయిల్యూర్ తో బీజేపీకి ఆ రాష్ట్రంలో నూకలు చెల్లే పరిస్థితి వచ్చిందని టాక్ నడుస్తోంది. సంఘ విద్రోహ చర్యలు పెరిగిపోవడం.. తుపాకీ రాజ్యం, అత్యాచార కేసులు, దళితులపై దాడులు ఇలా చెప్పలేనన్ని దారుణాలకు యూపీ అలవాలంగా మారిందన్న ఆరోపణలున్నాయి..

దేశంలో ఏ ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావాలంటే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కీలకం. ఇక్కడే ప్రజలే ప్రధానిని.. దేశంలో అధికారం ఎవరిదో తేల్చుతారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 542 సీట్లు ఉంటే ఏకంగా 80 ఎంపీ సీట్లు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. అంటే మేజిక్ ఫిగర్ 270కు పైగా స్థానాలు తెచ్చుకొని కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలోని 80 ఎంపీ సీట్లు అత్యంత కీలకం.. దానికి అధికారం అత్యవసరం.. యూపీలో ఓడిపోతే కేంద్రంలో ఓడిపోయినట్టే.. అందుకే ప్రధాని మోడీ ఫుల్ ఫోకస్ యూపీపై పెట్టాడు. అవసరమైతే యూపీ సీఎం యోగిని మార్చడానికి కూడా వెనుకాడడం లేదు.

తాజా కేబినెట్ విస్తరణలో యూపీకి మోడీ పెద్దపీట వేయడానికి అసలు కారణం అదే. ఏకంగా మొత్తం 77 మంది ఎంపీల్లో 14 మంది యూపీకి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటే మోడీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. దేశ చరిత్రలోనే ఒక రాష్ట్రానికి 14 కేంద్రమంత్రి పదవులు ఎప్పుడూ ఇవ్వలేదు.. అది మోడీకే సొంతం.. దీన్ని బట్టి మోడీ ఎంతగా యూపీ అంటే భయపడుతున్నాడో.. అక్కడ అధికారం కోసం ఎంతగా తపన పడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇంతమందిని యూపీ నుంచి తీసుకోవడం వెనుక అక్కడ గెలవాలని.. వీరందరిని మోహరించి ప్రజలను ఆకర్షించి రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలని మోడీ స్కెచ్ గీస్తున్నాడు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక్కడ కమలం పార్టీ ఓడిపోతే ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ కష్టమే. అందుకే మోడీ ఇంతమందికి మంత్రి పదవులు ఇచ్చి అతిపెద్ద రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.

పైగా యూపీలోని వారణాసి నుంచే మోడీ ఎంపీగా గెలిచాడు. దీంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో వేరే వారికి అధికారం దక్కితే అది మోడీకే అవమానం. పైగా యూపీలో సీఎం యోగి ఆధిత్యనాథ్ పై వ్యతిరేకత బాగా పెరిగిపోయిందట.. కరోనా వైరస్ నియంత్రణలో వైఫల్యం, శాంతి భద్రతల విఫలం, లవ్ జీహాద్, దళితులపై దాడులు, అత్యాచారాలతో ఉత్తరప్రదేశ్ రావణకాష్టంగా మారింది. ఈ వ్యతిరేకత బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తుందని అంటున్నారు.

ఈ క్రమంలోనే మోడీ నష్టనివారణ చర్యలు చేపట్టాడు. ఎలాగైనా గెలవాలని ఏకంగా ఆ రాష్ట్రంలో 14 మంది ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు ఇచ్చారు. ఇంత వ్యతిరేకతల మధ్యల వీరితో గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అదంత ఈజీ కాదు..

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక దఫా ఓడింది. బీజేపీపై వ్యతిరేకత బయటపడింది. యూపీలోని ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కూటమి కట్టబోతున్నాయి. దీంతో బీజేపీ వర్సెస్ ఈ కూటమి తలపడబోతున్నాయి. మరి ఎవరిది గెలుపు అన్నది ప్రజలే తేలుస్తారు. కానీ ముందస్తుగా మోడీ, బీజేపీలో ఆ భయం ఆవహించింది.