Begin typing your search above and press return to search.

అత్యధిక పోలింగ్ ఈసారి పక్కా..?

By:  Tupaki Desk   |   10 April 2019 4:50 AM GMT
అత్యధిక పోలింగ్ ఈసారి పక్కా..?
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ప్రతి 5 ఏళ్లకు ఓసారి ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడూ లేనంత ఉత్కంఠ, తీవ్రత.. ఆసక్తి ఈ ఆవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోళ్లు అందరూ ఊపిరి బిగిబట్టి మరీ ఎదురుచూస్తున్నారు.. ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? అని..

ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కట్టుబట్టలతో అమరావతికి తరలాల్సి వచ్చింది. దీంతోపాటు లోటు బడ్జెట్ తో సాగింది. హోదా హామనిచ్చి గద్దెనెక్కిన బీజేపీ కాలదన్నింది.. నాలుగేళ్లు ఆ పార్టీతో అంటకాగిన టీడీపీ అధినేత బాబు.. దెబ్బైపోతామని గ్రహించి ఎన్నికలకు ఏడాది ఉండగా బయటకు వచ్చి పెడబొబ్బలు పెట్టారు. ఇక వీరిద్దరి మోసంతో ఆగ్రహంగా ఉన్న జనాలు ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి ఆసక్తి పెంచుకున్నారు. అయితే చివర్లో చంద్రబాబు మోడీపై ఎదురుతిరగడం.. సంక్షేమ పథకాల జల్లు కురిపించడంతో జనాలు చీలిపోయారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ గా మారింది..

జనాల్లో కూడా ఏపీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్ని సర్వేలు చేసినా ఓటరు నాడి మాత్రం బయటపడడం లేదు. 50-50చాన్సులు టీడీపీ-వైసీపీకి ఉన్నాయంటూ అందరూ అంగీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈసారి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తాము కోరుకున్న పార్టీకి ఓటేయడానికి సిద్ధమయ్యారట.. ఉమ్మడి ఏపీ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 11న జరగబోతోందని సమాచారం.. జనాలు కూడా ఈ ఉత్కంఠ పోరులో ఎవరిని గెలిపించాలనే దానిపై ఆసక్తితో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరేందుకు రెడీ అయ్యారు. ఎప్పుడూ 80శాతం దాటని ఏపీ పోలింగ్ ఈసారి 80శాతానికి పైగా చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో ఓటు హక్కు ఉన్న వివిధ దేశాలు, రాష్ట్రాలు, తెలంగాణలో ఉన్నవాళ్లందరూ ఏపీలోని స్వస్థలాలకు బయలు దేరారు. తమకు నచ్చిన పార్టీకి ఓటేసేందుకు అన్నీ దారులు ఏపీవైపే సాగుతున్నాయి. సో ఈ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదుకావడం గ్యారెంటీగా మారింది. సో ఓటర్లు పారాహుషార్.. ఈసారి తప్పకుండా ఓటేయ్యండి.. ఏపీ తలరాతను మార్చే మీ ఓటును మిస్ చేయకండి..