Begin typing your search above and press return to search.

మోడీ విష‌యంలో జ‌గ‌న్ వ్యూహం మారిందా...?

By:  Tupaki Desk   |   26 Sept 2021 5:14 PM IST
మోడీ విష‌యంలో జ‌గ‌న్ వ్యూహం మారిందా...?
X
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై ఏపీ సీఎం జ‌గ‌న్ వైఖ‌రి మారిందా ? ఇప్ప‌టి వ‌ర‌కు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ.. కేంద్రం విష‌యంలో వ్య‌వ‌హారాలు న‌డిపిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇక‌పై త‌న వ్య‌వ‌హారంలో కాఠిన్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారా ? కేంద్రాన్ని లెక్క‌చేయ‌కుండా దూకుడుగా వెళ్లాల‌ని భావిస్తున్నారా ? అంటే.. తాజాగా జ‌రిగిన‌ప‌రిణామం.. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం చూసిన విశ్లేష‌కులు అవున‌నే అంటున్నారు. దేశంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై రైతులు.. ఇత‌ర బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాలు.. భార‌త్ బంద్ ప్ర‌క‌ట‌న జారీచేశాయి. దీనికి బీజేపీ పాలిత రాష్ట్రాలు త‌ప్ప‌.. మిగిలిన రాష్ట్రాల్లో ఒడిసా, తెలంగాణ మిన‌హా.. అన్ని రాష్ట్రాలూ మ‌ద్ద‌తిస్తున్నాయి.

ఈ నెల 27న (సోమ‌వారం) భార‌త్ బంద్ జ‌ర‌గ‌నుంది. అయితే.. ఆది నుంచి కూడా మోడీపై వ్య‌తిరేక విధానానికి మొగ్గు చూప‌ని సీఎం జ‌గ‌న్‌.. ఇప్పుడు భార‌త్ బంద్ విష‌యంలో మాత్రం దూకుడుగా నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు వ్య‌తిరేకంగా తీసుకు వ‌చ్చిన చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తోంది. వాస్త‌వానికి నాలుగు నెల‌ల కింద‌ట కూడా.. భార‌త్ బంద్ నిర్వ‌హించారు. అయితే.. అప్ప‌ట్లో ఇంత దూకుడుగా నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ, ఇప్పుడు రెండు రోజుల ముందుగానే భార‌త్ బంద్‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకున్నారు. నిజానికి రైతులు త‌మ హ‌క్కుల కోసం.. నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా.. ఈ బంద్‌ను పాటిస్తున్నారు.

అయితే.. జ‌గ‌న్ ఏపీలో అన్నీ చేస్తున్నారు. రైతుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ప‌నులు , సంక్షేమ ప‌థ‌కాలు కూడా అమ‌లు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. బంద్‌లో పాల్గొన‌డం అంటే.. కేంద్రానికి వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేయ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా ? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. కేంద్రం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ.. విజ‌య‌సాయిరెడ్డే అనుకూలంగా మాట్లాడారు. రాజ్య‌స‌భ‌లో అంగీక‌రించారు. కానీ, ఇప్పుడు దీనికి వ్య‌తిరేకంగా సాగుతున్న బంద్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అంటే.. కేంద్రానికి బ‌ల‌మైన సంకేతం ఇస్తున్న‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌కు కేంద్రం నుంచి అనేక ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.

ముఖ్యంగా ఆర్థిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, జ‌ల వివాదాలు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు ఇలా.. అనేక ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అంతో ఇంతో కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేక సెగ చూపించాల‌ని.. ``ఎల్లప్పుడూ.. మీకు సానుకూల‌మేకాదు.. అవ‌కాశం వ‌స్తే.. మేం కూడా మా స్థాయి చూపిస్తాం`` అనే వాద‌న‌ను జ‌గ‌న్ వినిపించేందుకు ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి కేంద్రం ఎలా చూస్తుందో ? చూడాలి.