Begin typing your search above and press return to search.

రెండేళ్లలో కేసీఆర్ అంత బరువు తగ్గారా?

By:  Tupaki Desk   |   8 Feb 2020 7:03 AM GMT
రెండేళ్లలో కేసీఆర్ అంత బరువు తగ్గారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరకు వెళ్లి రావటం తెలిసిందే. మేడారం జాతర సందర్భంగా అమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కుగా చెల్లించుకోవటం ఆనవాయితీ గా వస్తోంది. దీంతో.. మొక్కులు తీర్చుకోవాలనుకునే వారు.. తమ బరువుకు తగ్గ బెల్లాన్ని ఇస్తుంటారు. మేడారానికి వచ్చిన సీఎం కేసీఆర్ సైతం తన నిలువెత్తు బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పించుకున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ బరువు బయటకు వెల్లడైంది. సన్నగా రివాటలా ఉండే ముఖ్యమంత్రి కేవలం 51 కేజీలు మాత్రమే ఉండటం గమనార్హం. బక్కపల్చటి మనిషి అన్న పేరుకు తగ్గట్లే.. కేసీఆర్ బరువు ఉండటం ఒక ఎత్తు అయితే.. రెండేళ్ల క్రితం జరిగిన మేడారం సందర్భంగా అప్పట్లోనూ బెల్లాన్ని సమర్పించుకున్నారు. ఆ సమయం లో ముఖ్యమంత్రి బరువు 54 కేజీలు కాగా.. తాజాగా మాత్రం 51 కేజీలు మాత్రమే ఉన్నారు. అంటే.. రెండేళ్ల వ్యవధిలో మూడు కేజీలు తగ్గటం ఆసక్తికరంగా మారింది.

గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ తీసుకోవటం తో పాటు.. డైట్ విషయంలోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతారు. చూసేందుకు సన్నగా ఉన్నప్పటికీ.. కేసీఆర్ కు తిండి పుష్టి ఎక్కువనే చెబుతారు. నాన్ వెజ్ ను అమితంగా ఇష్టపడే ఆయన.. బాగానే తినేవారని.. ఇటీవల కాలంలో తీసుకునే ఆహారం విషయం లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటంతోనే.. ఆయన బరువు తగ్గినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం పలువురు ప్రముఖులు మేడారం జాతర కు హాజరయ్యారు. గవర్నర్ తమిళ సై తొలిసారి మేడారం జాతరకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కూడా అమ్మవార్లకు తన బరువుకు తగ్గ బంగారాన్ని సమర్పించారు. తమిళసై 66 కేజీల బరువు తూగితే.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ 55 కేజీల బరువు తూగారు. మేడారం జాతర ఏమో కానీ.. ప్రముఖుల బరువు ఎంతన్నది బయటకు వచ్చేలా చేసిందని చెప్పక తప్పదు.