Begin typing your search above and press return to search.

క‌ర్నూలు ఎయిర్ పోర్టు ఘ‌న‌త కూడా బాబుదేన‌ట‌!

By:  Tupaki Desk   |   8 Jan 2019 11:32 AM GMT
క‌ర్నూలు ఎయిర్ పోర్టు ఘ‌న‌త కూడా బాబుదేన‌ట‌!
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఇప్పుడు నిజంగానే బ్యాండ్ బాబుగా మారిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో. ఎందుకంటే క్రెడిట్ ద‌క్కే ప్ర‌తి అంశాన్ని త‌న ఖాతాలో వేసుకునే చంద్ర‌బాబు... త‌న ఇమేజీకి డ్యామేజీ చేసే ఏ ఒక్క అంశాన్ని కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. క్రెడిట్ ద‌క్కే ప్ర‌తి ప‌నినీ తానే మొద‌లుపెట్టాన‌ని, తానే పూర్తి చేశాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు... మైలేజీ ద‌క్క‌ని విష‌యాన్ని చాలా ఈజీగానే వ‌దిలేస్తున్న వైనం మ‌న‌కు కొత్తేమీ కాదు. పోల‌వ‌రం ప్రాజెక్టు చాలా ఏళ్ల క్రిత‌మే నిర్మాణం ప్రారంభం కాగా... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి హ‌యాంలో కాలువ‌ల ప‌నులు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. అయితే మొత్తం పోల‌వ‌రం క్రెడిట్ మొత్తం త‌న‌దేన‌న్న కోణంలో ప్ర‌చారం చేసుకుంటున్న చంద్ర‌బాబు... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్రతి చిన్న ప‌నికీ ఓ శిలాఫ‌ల‌కం వేస్తూ, ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకుంటూ ప్ర‌చార పండుగ చేసుకుంటున్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు సాగు నీళ్లిచ్చామంటూ గొప్ప‌లు చెప్పుకున్న చంద్ర‌బాబు... వైఎస్ హ‌యాంలోనే 90 శాతం పూర్తి అయిన గండికోట ప్రాజెక్టుకు గేట్లు పెట్టి... తానే ఆ ప్రాజెక్టును పూర్తి చేశాన‌ని డ‌బ్బా కొట్టుకున్నారు.

తాజాగా వైఎస్ హ‌యాంలోనే దాదాపుగా అనుమ‌తుల‌న్ని వ‌చ్చేసి, భూసేక‌ర‌ణ కూడా పూర్తి అయిన క‌ర్నూలు ఎయిర్ పోర్టును కూడా బాబు త‌న ఖాతాలో వేసేసుకున్నారు. వాస్త‌వంగా ఉమ్మ‌డి రాష్ట్రంలో బాబు సీఎంగా కొన‌సాగిన తొమ్మిదిన్న‌రేళ్ల పాటు తాను రాయ‌ల‌సీమ‌కు చెందిన వాడే అయిన‌ప్ప‌టికీ... బాబు సీమ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. అంతేనా... అస‌లు సీమ‌ను ఓ ఫ్యాక్ష‌న్ ఖిల్లాగా అభివ‌ర్ణించేసిన బాబు... సీమ అభివృద్ధిపై శీత‌క‌న్నేశారు. ఆ త‌ర్వాత బాబు పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడిన దివంగ‌త సీఎం, మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అధికారంలోకి రాగానే... రాయ‌ల‌సీమ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. తాగు, సాగు నీరు లేని ప్రాంతాల‌ను స‌శ్య‌శ్యామలం చేసే దిశ‌గా ప్రాజెక్టులకు రూప‌క‌ల్ప‌న చేస్తూ సాగిన వైఎస్‌... క‌ర్నూలు జిల్లాలోని ఓర్వ‌క‌ల్లు ప్రాంతంలో విమానాశ్ర‌యం ఏర్పాటు చేస్తే ఎలాగుంటుంద‌ని ఆలోచించారు. క‌ర్నూలు న‌గ‌రానికి కేవ‌లం ఓ 20 కిలో మీట‌ర్ల దూరంలోని ఈ ప్రాంతం సాగుకు యోగ్య‌మైన‌దేమీ కాదు. అంతా కొండ‌లు, గుట్ట‌లుగా ఉన్న ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు వ‌స్తే... సీమ‌కు ప్ర‌త్యేకించి క‌ర్నూలు జిల్లాలో ఓ మోస్త‌రు అభివృద్ధిని చూడ‌వ‌చ్చ‌ని వైఎస్ భావించారు.

అంతేకాకుండా రాయ‌ల‌సీమ‌లోని మిగిలిన మూడు జిల్లాలైన క‌డ‌ప‌, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో అప్ప‌టికే ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఎయిర్ పోర్టు లేని రాయల‌సీమ జిల్లా ఒక్క క‌ర్నూలే. ఈ విష‌యాన్ని కూడా గ‌మ‌నించిన వైఎస్‌... క‌ర్నూలు జిల్లాకు ఆ లోటును తీర్చ‌డంతో పాటుగా... మ‌ధ్య శ్రేణి న‌గ‌రాల‌కూ విమానాశ్ర‌యాల విస్త‌ర‌ణ కోసం కేంద్రం ప్ర‌తిపాదించిన ప‌థ‌కాల‌ను కూడా ఉప‌యోగించుకుందామ‌న్న భావ‌న‌తోనే వైఎస్ నాడు ఓర్వ‌కల్లు ఎయిర్ పోర్టుకు శ్రీ‌కారం చుట్టారు. అనుకున్న‌దే త‌డ‌వుగా... సాగుకు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డని భూమిని ఎయిర్ పోర్టు కోసం సేక‌రించే ప‌నికి శ్రీ‌కారం చుట్టారు. దాదాపుగా భూ సేక‌ర‌ణ కూడా అప్పుడే పూర్తి అయిన‌ట్టేన‌ని జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక కూడా పంపింది. అయితే వైఎస్ అకాల మ‌ర‌ణంతో ఆ త‌ర్వాత వ‌చ్చిన రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాలు దీనిపై ఓ అడుగు ముందుకు, రెండడుగులు వెన‌క్కు అన్న చందంగా వ్య‌వ‌హ‌రించాయి.

అయితే ఇప్పుడు వైఎస్ స‌ర్కారు సేక‌రించిన భూముల్లోనే ఎయిర్ పోర్టును క‌ట్టేసిన చంద్ర‌బాబు... దానిని నేటి ఉద‌యం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోట ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు వినిపించాయి. అస‌లు ఓర్వ‌క‌ల్లు లాంటి ప్రాంతంలో ఎయిర్ పోర్టు వ‌స్తుంద‌ని ఏ ఒక్క‌రూ అనుకోలేద‌ని, దానిని తాను సాకారం చేశాన‌ని సెల్ఫ్ డ‌బ్బా బాగానే కొట్టుకున్నారు. అయినా వైఎస్ సేక‌రించి పెట్టిన భూముల్లో చంద్ర‌బాబు క‌ట్టిందేమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. ఎయిర్ పోర్టు లాంజీ త‌ర‌హాలో ఓ చిన్న నిర్మాణం... ఇంకా పూర్తి కాని ర‌న్ వే మాత్ర‌మే. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ర‌న్ వే నిర్మాణం పూర్తి కాకున్నా... బాబు ఎయిర్ పోర్టుకు శంకుస్థాప‌న చేసేశారు. వైఎస్ లాంటి దార్శ‌నీకుడు చేసిన కార్యాన్ని కూడా త‌న ఖాతాలో వేసుకుంటున్న బాబు నైజం తెలిసి జ‌నం న‌వ్వుకుంటున్నారన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.