Begin typing your search above and press return to search.

కూటమి సీఎం.... దళితులకే ?

By:  Tupaki Desk   |   6 Dec 2018 6:40 AM GMT
కూటమి సీఎం.... దళితులకే ?
X
తెలంగాణ ముందస్తు ఎన్నికల యుద్ధం చివరి దశకు చేరింది. మరో 24 గంటల్లో ఓటింగ్ జరగనుంది. ఇక నాలుగు రోజులు ఆగితే తెలంగాణ లో రాజు ఎవరో.... ఓటమి ఎవరిదో కూడా తేలిపోతుంది. ఈ దశలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే ప్రశ్న అన్ని వర్గాల్లోనూ వినిపిస్తోంది. గడచిన నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికే తిరిగి పట్టం కడితే ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే ముఖ్యమంత్రి కావడం ఖాయం.

ఇక మిగిలింది ప్ర‌జా కూటమి మాత్రమే. కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది పెద్ద ప్రశ్నగా ఉంది. కూటమిలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని అందరి ఆలోచన. ప్రజాకూట‌మిలోని ఇతర పక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీకే ఆత్యున్నత స్థానాన్ని కట్టబెడతాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేదే ఇప్పుడు చర్చగా ఉంది.

నిజానికి కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం పీసీసీ అధ్యక్షుడు కాని, పార్టీ లో సీనియర్ నాయకుడు కాని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తుంది. అయితే తెలంగాణ లో మాత్రం ఈ సంప్రదాయాన్ని కాస్త పక్కన పెట్టే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో తమ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. అయితే ఆయన ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.

దీంతో ప్రజల్లో ముఖ్యంగా దళితుల్లో చంద్రశేఖర రావు పట్ల కాసింత వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ ఎన్నికల్లో ప్ర‌జా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి దళిత నాయకుల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తారని అంటున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రెడ్డి కులస్తులదే అనే అపవాదు కూడా పోతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.