Begin typing your search above and press return to search.

ప్రియాంక ఎంట్రీ!... రాహుల్‌ కు న‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   25 Jan 2019 1:30 AM GMT
ప్రియాంక ఎంట్రీ!... రాహుల్‌ కు న‌ష్ట‌మేనా?
X
నిజ‌మే... ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో ఇదే త‌ర‌హా చ‌ర్చ న‌డుస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా న‌రేంద్ర మోదీని ప్ర‌క‌టించిన‌ప్పుడు... త‌మ అభ్య‌ర్థి రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ గ‌ట్టిగా ఓ ప్ర‌క‌ట‌న చేయలేక‌పోయింది. అంటే... మోదీని ఢీకొట్ట‌గ‌లిగే స‌త్తా రాహుల్ గాంధీకి లేద‌ని కాంగ్రెస్ పెద్ద‌లు చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ట‌య్యింద‌న్న వాద‌న కూడా నాడు బాగానే వినిపించింది. ఆ క్ర‌మంలోనే మోదీ నేతృత్వంలో బ‌రిలోకి దిగిన బీజేపీ... కాంగ్రెస్‌ ను చిత్తు చిత్తుగా ఓడించింది. గ‌తంలో ఏనాడూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాకు త‌గ్గ‌కుండా స‌త్తా చాటుకుంటూ వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ... రాహుల్ నేతృత్వంలో చిత్తుగా ఓడిపోయి...క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాకు కూడా మోదీ వ‌ద్ద ప్రాధేయ‌ప‌డాల్సిన దుస్థితి వ‌చ్చింది. పోనా... ఈ నాలుగున్న‌రేళ్ల‌లో రాహుల్ గాంధీ ఏమైనా త‌న హవాను పెంచుకున్నారా? అంటే... అది కూడా లేదు. ఈ కార‌ణంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా మోదీ నేతృత్వంలోని బీజేపీకే విజ‌యావ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌న్న వాద‌న‌కు అంత‌కంత‌కూ బ‌లం చేకూరుకుతోంది. స‌ర్వేల‌న్నీ కూడా ఇదే మాట‌ను చెబుతున్నాయి.

మ‌రోవైపు కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌ల‌మైన ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థి క‌నిపించ‌ని కార‌ణంగానే... నేడు తృతీయ ఫ్రంట్, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌, మ‌హా కూట‌మి అంటూ చాలా కూట‌ములు రంగంలోకి దిగుతున్నాయ‌ని కూడా చెప్పాలి. మోదీ కాకుండా నెక్ట్స్ ప్ర‌ధాని ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు.. రాహుల్ గాంధీ అని బ‌ల్ల‌గుద్ది చెప్పే ఒక్క నేత కూడా కాంగ్రెస్ లో లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. ఈ నేప‌థ్యంలోనే మోదీ కాకుండా భావి భార‌త ప్ర‌ధాని ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు.... మాయావ‌తి, మ‌మ‌తా బెన‌ర్జీ అంటూ చాంతాడంత జాబితా వినిపిస్తోంది. ఈ వాస్త‌వ ప‌రిస్థితుల‌న్నింటినీ చాలా సైలెంట్ గానే గ‌మ‌నిస్తూ వ‌స్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, రాహుల్ గాంధీ త‌ల్లి ఇప్పుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా పోటీ చేసే వ్యక్తి త‌న కుటుంబం నుంచే రావాల‌న్న భావ‌న‌తో సోనియా ఇప్పుడు త‌న కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా పేరును దాదాపుగా ప్ర‌క‌టించేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందుగా ప్రియాంక‌ను ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డంతో పాటుగా దేశంలోనే కీల‌క రాష్ట్రమై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇంచార్జీగా నియ‌మించ‌డం చూస్తుంటే... రానున్న ఎన్నిక‌ల నాటికి రాహుల్ ప్లేస్ లో ప్రియాంక‌ను ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దించే అవ‌కాశాలే మెండుగా క‌నిపిస్తున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా మ‌ళ్లీ మోదీ వ‌చ్చినా... ఇంకెవ‌రు వ‌చ్చినా... కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక దిగే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా మార్పు వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి ఫ‌లితం ల‌భించ‌నున్నా.. రాహుల్ గాంధీ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కం కానుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన రాహుల్ గాంధీ... త‌న‌దైన శైలి స‌త్తా చాట‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. రాహుల్ గాంధీ విఫ‌లం అయిన కార‌ణంగానే క‌దా... సోనియా గాంధీ ఇక లాభం లేద‌నుకుని ప్రియాంక‌ను రంగంలోకి దింపుతున్న‌దని విశ్లేష‌కులు చెబుతున్నారు. మోదీని ఓడించడం మాట అటుంచితే... మోదీని ఢీకొట్ట‌గ‌లిగే సామ‌ర్థ్యం రాహుల్ లో లేవ‌ని నిర్ధార‌ణ కావ‌డంతోనే క‌దా ప్రియాంక‌ను రంగంలోకి దింపుతున్న‌ద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా ప్రియాంక ఎంట్రీ కాంగ్రెస్‌ కు లాభించినా... రాహుల్ కు మాత్రం పెద్ద లాసేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.