Begin typing your search above and press return to search.

ఉమ్మ‌డి కృష్ణాలో టీడీపీ జోరు త‌గ్గిందా...?

By:  Tupaki Desk   |   3 Nov 2022 4:27 AM GMT
ఉమ్మ‌డి కృష్ణాలో టీడీపీ జోరు త‌గ్గిందా...?
X
ఔను! ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో ఒక‌ప్పుడు ఉన్న టీడీపీ జోరు ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌నే వాద‌న నాయ‌కుల మ‌ధ్య జోరుగా వినిపిస్తోంది. ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు త‌ప్పితే మిగిలిన చోట్ల నాయ‌కులు పార్టీ కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమితం అవుతున్నారు. మీడియా స‌మావేశాల‌కే ప‌రిమితం అవుతున్నార‌నేది చంద్ర‌బాబు చెబుతున్న మాట‌. ఇటీవ‌ల కృష్ణా జిల్లాలో పార్టీ ప‌రిస్తితిపై సీనియ‌ర్ నాయ‌కులు, జిల్లాకు చెందిన మాజీ మంత్రుల‌తో ఆయ‌న స‌మీక్షించారు. ప్ర‌స్తుతం రెండు జిల్లాలుగా ఉన్న‌ప్ప‌టికీ.. అంద‌రినీ పిలిచి చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న మొత్తం 16 నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా స‌మీక్ష చేశారు. దీనిలో చాలా వీక్‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు 10 ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. వీటిలో మాజీ మంత్రి ర‌వీంద్ర ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌చిలీప‌ట్నం కూడా ఉంద‌న్నారు. అదేవిధంగా విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, నందిగామ‌, తిరువూరు(ఇక్క‌డ మ‌రిన్ని వివాదాలు ఉన్నాయి), పెడ‌న‌, జ‌గ్గ‌య్య‌పేట ఇలా.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం పేరును చంద్ర‌బాబు చ‌దివి వినిపించారు. పైగా ఆయా నేత‌లు త‌న క‌ళ్లు క‌ప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తీవ్రంగానే వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది.

''మీడియా మీటింగులు పెట్టి వైసీపీ నేత‌ల‌ను నాలుగు మాట‌లు అనేస్తే మ‌న బాధ్య‌త తీరిపోతుందా? పార్టీ ఎలా డెవ‌ల‌ప్ అవుతుంది?'' అని నిల‌దీసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా వైసీపీ మంత్రులుగా ఉన్న వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ వీక్‌గా ఉంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ''నూజివీడులో పార్టీ పుంజుకునేందుకు ఉన్న స‌మ‌స్య‌లు ఏంటి? అక్క‌డ ఎమ్మెల్యే యాక్టివ్‌గా లేడు.

మ‌నం పుంజుకోవాల‌ని తెలియ‌దా? ఇంకెప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్తారు. మీ అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌తో పార్టీని దెబ్బ‌తీయొద్దు. అవ‌న్నీ ప‌క్కన పెట్టి పార్టీ కోసం క‌లిసి ప‌నిచేస్తేనే పార్టీ డెవ‌ల‌ప్ అవుతుంది.

లేక పోతే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గం చేజారిపోతుంది'' అని హెచ్చ‌రించారు. ఇక‌, మైల‌వ‌రంలోనూ మాజీ మంత్రి దేవినేని ఉమా స‌రిగా లేర‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఒక సామాజిక వ‌ర్గం నేత‌లు రోడ్డు మీద‌కు వ‌చ్చి ఆందోళ‌న‌లు చేస్తున్నారు. వారిని కూడా ప‌ట్టించుకోకుండా ఉంటే పార్టీకి ఎవ‌రు అండ‌గా ఉంటారు. జ‌రిగిందేదో జ‌రిగింది.. ఇప్ప‌టి నుంచి అయినా ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకుని ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

ఇక‌, పామ‌ర్రు, తిరువూరు వంటి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌తంలో టీడీపీ అమ‌లు చేసిన ఎస్సీ ప‌థ‌కాల‌ను ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు పెట్టాల‌ని చంద్ర‌బాబుసూచించారు. అదేవిధంగా విజ‌య‌వాడ స‌హా గుడివాడ‌లోని కొండ‌ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు త‌మ ప్ర‌భుత్వంలోనే న్యాయం జ‌రిగింద‌ని, వారికి ప‌ట్టాలు ఇచ్చామ‌ని, ఇలాంటి విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు, కొన్నిచోట్ల నాయ‌కులు వీక్‌గా ఉన్న‌ట్టు త‌న‌కు తెలిసింద‌ని, వారిని ఉపేక్షించేది లేద‌ని మ‌రో ఆరు మాసాల త‌ర్వాత కూడా ప‌రిస్థితి ఇలానే ఉంటే మార్పు త‌ప్ప‌ద‌ని హ‌చ్చ‌రించారు. మ‌రి త‌మ్ముళ్లు మార‌తారా? చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.