Begin typing your search above and press return to search.

తెలంగాణ 'ట్వీట్స్ రాష్ట్రం' అయిందా?

By:  Tupaki Desk   |   6 May 2022 12:42 PM GMT
తెలంగాణ ట్వీట్స్ రాష్ట్రం అయిందా?
X
తెలంగాణ రాష్ట్రం ట్వీట్స్ రాష్ట్రంగా మారిందా? అధికార ప్ర‌తిపక్ష నాయ‌కుల మ‌ధ్య ట్వీట్ల వార్ న‌డుస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ట్వీట్లు, రీ ట్వీట్లు న‌డుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌కు ఆ పార్టీ అగ్ర నేత‌.. రాహుల్ గాంధీ వ‌స్తున్నారు. దీంతో ``ఎందుకు వ‌స్తున్నారంటూ.. టీఆర్ ఎస్ పార్టీ నాయ‌కులు.. మంత్రి కేటీఆర్‌, ఆయ‌న సోద‌రి, ఎమ్మెల్సీ క‌విత వ‌రుస ట్వీట్ల‌తో ట్విట్ట‌ర్‌ను హోరెత్తించారు.

‘గౌరవ రాహుల్ గాంధీ, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ?. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు , నిధుల గురించి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?`` అని క‌విత‌ ప్ర‌శ్న‌లు సంధించారు.

ఇక‌, దీనికి రీ ట్వీట్‌గా కాంగ్రెస్, బీజేపీ నేత‌లు.. టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయంటూ.. నిల‌దీశాయి. ఈ క్ర‌మంలో రేవంత్‌రెడ్డి కూడా వ‌రుస ట్వీట్ల‌తో అద‌ర‌గొట్టారు. ‘‘మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరి తాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఫామ్ హౌజ్‌లో వరి వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం రాశులు తడిసి రైతులు బోరున విలపిస్తున్నారు.. వారి కష్టం పట్టించుకోకుండా మీరు ఎక్కడ’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ ట్వీట్ల‌తో తెలంగాణ‌.. ఇప్పుడు ట్వీట్స్ రాష్ట్రంగా మారిందా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.