Begin typing your search above and press return to search.

స్టూడియోలకు స్థలాల సేకరణ మొదలైందా ?

By:  Tupaki Desk   |   12 Feb 2022 5:42 AM GMT
స్టూడియోలకు స్థలాల సేకరణ మొదలైందా ?
X
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఆచరణలో పెట్టడానికి అధికార యంత్రాంగం చర్యలు మొదలు పెట్టింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సినీ పరిశ్రమను ఏపీకి తరలిరావాలని జగన్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. పరిశ్రమ ఎదుర్కొంటున్న టికెట్ల ధరలు, ఆన్లైన్ విధానం తదితర సమస్యల పరిష్కారానికి చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నారాయణమూర్తి, ఆలీ తదితరులు సమావేశమైన విషయం తెలిసిందే.

ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ పరిశ్రమను వైజాగ్ కు తరలిరావాలని ఆఫర్ ఇచ్చారు. స్టూడియోల నిర్మాణాలకు అవసరమైన స్ధలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఏపీలో షూటింగ్ చేసుకోవటానికి అవసరమైన అనుమతులు, వాతావరణం కల్పిస్తామని కూడా చెప్పారు. స్టూడియో నిర్మాణాలకు, ఇళ్ళ నిర్మాణాలకు స్ధలాలు ఇస్తామంటే ఎవరైనా కాదంటారు. అలాగే సినిమా వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు.

సినీ ప్రముఖులకు ఇచ్చిన హామీలో భాగంగానే వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ప్రాంతంలో స్ధలాల సేకరణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. పై మూడు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి సేకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయటానికి చర్యలు మొదలుపెట్టింది.

ఇందుకోసం రెవిన్యు, మున్సిపల్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. లిటిగేషన్ లేని భూములను పెద్ద ఎత్తున సేకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎంత భూమి లభ్యత ఉందనేది స్పష్టమవుతుంది.

ఇలా సేకరించిన భూములను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అలాగే ఏపీలో ఏ మూలన షూటింగులు చేసుకోవాలని సినిమా వాళ్ళు అనుమతులు అడిగినా వెంటనే ఇవ్వాలని పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, టూరిజం లాంటి శాఖలకు ఆదేశాలు అందాయి.

సినిమా షూటింగులకు అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి సిని పరిశ్రమ ఏపీకి ప్రత్యేకంగా వైజాగ్ కు తీసుకురావాలనే చిత్తశుద్ది ప్రభుత్వంలో కనిపిస్తోంది.