Begin typing your search above and press return to search.

కేసీఆర్ సమర్థతపై సందేహాలు తెచ్చేలా యాదాద్రి.. తాజా వర్షానికి ఆగమాగం

By:  Tupaki Desk   |   4 May 2022 3:30 PM GMT
కేసీఆర్ సమర్థతపై సందేహాలు తెచ్చేలా యాదాద్రి.. తాజా వర్షానికి ఆగమాగం
X
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. ఒక ప్రాచీన దేవాలయాన్ని భారీగా మార్పులు చేసి.. దేశంలోనే అత్యుత్తమ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా చేసేందుకు ఆయన ప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనంతో పాటు.. భారీ ఎత్తున వనరుల్ని అందించారు. అన్నింటికి మించి ఈ ఆలయానికి చేస్తున్న మార్పులు చేర్పుల కోసం పలుమార్లు యాదాద్రికి వెళ్లటం.. ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసేవారు. ఇలా యాదాద్రి కోసం కేసీఆర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.

ముఖ్యమంత్రిగారి డ్రీం ప్రాజెక్టు అయిన యాదాద్రిని పూర్తి చేయటం వరకు బాగానే ఉంది కానీ.. తాజాగా కురిసిన వర్షానికి యాదాద్రి పుణ్యక్షేత్రం ఆగమాగం కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. గతంలో చాలాసార్లు వర్షాలు పడినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితి గతంలో చోటు చేసుకోలేదని చెబుతున్నారు. ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున పెద్ద ఎత్తున వర్షం కురిసింది. తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు.. యాదాద్రి.. హైదరాబాద్ మహానగరంలో వానదేవుడు తన ప్రతాపాన్ని చూపించాడు.

కొద్ది గంటల పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ మహానగరం గజగజలాడిపోయింది. పలు చోట్ల రోడ్ల మీద వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో పాటు.. పలుచోట్ల వృక్షాలు విరిగి పడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగిన పరిస్థితి. హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే.. యాదాద్రి పుణ్యక్షేత్రం పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది.

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పరిసరాలతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. సాధారణంగా వర్షం కురిసినప్పుడు వాన నీరు నిలవకుండా ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున డ్రెయినేజీ వ్యవస్థను ఆధునీకరించి ఉండాల్సింది.

మరేం జరిగిందో తెలీదు కానీ.. వాన పడితే నీరు నిలిచిపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అంతేనా.. యాదగిరిగుట్ట కొండ పై నుంచి కిందకు కొత్తగా నిర్మించిన రోడ్డు కుంగిపోవటం షాకింగ్ గా మారింది.
కొండపై నుంచి దిగువన వచ్చిన వర్షపునీరు కాలనీలోకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తోంది.

కొత్తగా నిర్మించిన చోట.. పాత కష్టాలు పోయి కొత్త వసతులు సౌఖ్యం తెలియాల్సిన స్థానే.. ఊహించని చిక్కుల్ని తాజా వర్షం చూపించిందన్న మాట వినిపిస్తోంది. ఇన్నేసి వందల కోట్లు పోసి చేసిన పనులకు అర్థం లేని విషయాన్ని తాజా వర్షం నిరూపించిందంటున్నారు. యాదాద్రి కోసం ముఖ్యమంత్రి చేసిన ప్లానింగ్.. ఒక్క వర్షానికే తేలిపోయినట్లుగా ఎందుకు జరిగింది? తేడా ఎక్కడ కొట్టింది? ఇదంతా చూస్తే.. సీఎం కేసీఆర్ సమర్థత మీదా.. ప్లానింగ్ మీదా కొత్త సందేహాలు కలుగక మానవు.