Begin typing your search above and press return to search.

‘చీరాల’ పంచాయితీ లెక్క తేల్చేశారా?

By:  Tupaki Desk   |   5 Feb 2021 11:10 AM GMT
‘చీరాల’ పంచాయితీ లెక్క తేల్చేశారా?
X
ఒకరికి మించి మరొకరు అన్నట్లు వ్యవహరించే అధికారపార్టీ నేతల మధ్య అధిపత్య పోరు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారటం తెలిసిందే. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమోహన్ ల మధ్య నడిచే పోరు పార్టీకి తరచూ ఇబ్బందికి గురి చేయటం తెలిసిందే. చీరాల పంచాయితీని కొలిక్కి తెచ్చేందుకు వీలుగా అధిష్ఠానం రాజీ ఫార్ములాను సిద్ధం చేసింది.

గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్న వరుస ఘటనలో అదే పనిగా జరుగుతున్న రచ్చతో విసిగిపోయిన అధినాయకత్వం కొందరు మంత్రులకు బాధ్యత అప్పజెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా.. ఇద్దరు నేతలకు సరిహద్దుల్ని సెట్ చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో మంత్రి బాలినేనితో పాటు.. సజ్జల.. ప్రభాకర్ రెడ్డిలు రంగంలోకి దిగారు. ఉభయులతో మాట్లాడిన ఈ టీం చివరకు ఒక రాజీ ఫార్ములాను సిద్ధం చేసింది.

ఎమ్మెల్యే కరణం బలరాంకు చీరాల భాద్యతను అప్పజెప్పి.. ఆమంచికి పర్చూరు పార్టీ బాధ్యతల్ని అప్పజెప్పనున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైంది. అందుకు ఆమంచిని ఒప్పించినట్లుగా చెబుతున్నారు. పంచాయితీ ఎన్నికల్లో రామన్నపేటలో కరణం మద్దతు ఇచ్చే మహిళా నేత రమణను సర్పంచ్ గా ఏకగ్రీవం చేయాలని డిసైడ్ చేశారు. ఈ సందర్భంగా మరెవరూ అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.

అయితే.. ఇద్దరు నేతల మధ్య వచ్చే ఎన్నికల వేళ.. చీరాల టికెట్ ఎవరిదన్న విషయం పీటముడిగా మారింది. దీనిపై అధిష్ఠానం ప్రత్యేక ఫార్ములాను రూపొందించింది. ఇప్పుడు డిసైడ్ చేసిన సరిహద్దులు.. వచ్చే ఎన్నికల వరకు ఉభయులు ఫాలో కావాలని.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయాన్ని వారికి చెప్పగా.. వారు అందుకు అంగీకరించినట్లుగా చెబుతున్నారు. అప్పటివరకు ఎవరికి వారు.. వారికి నిర్దేశించిన పరిధిని దాటకూడదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ సయోధ్యపార్టీ భావించినట్లు వచ్చే ఎన్నికల సమయం వరకు ఉంటుందని చెబుతున్నారు. ఎవరూ దీన్ని అతిక్రమించకూడదన్న విషయాన్ని స్పష్టం చేయగా.. అందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి.. ఈ రాజీ ఎంతవరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.