Begin typing your search above and press return to search.

గంటా’ను సాగనంపే ప్రక్రియ మొదలైందా?

By:  Tupaki Desk   |   21 March 2021 9:16 AM GMT
గంటా’ను సాగనంపే ప్రక్రియ మొదలైందా?
X
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుయే కారణమని విశాఖ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం నగరం మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. గట్టి పట్టు ఉన్నా టీడీపీ గెలవకపోవడానికి కారణం గంటా అని వారంతా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎమ్మెల్యేలుగా టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. టీడీపీకి గట్టి క్యాడర్ ఉంది. అయినా కూడా విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ 40 డివిజన్లే గెలుచుకోగలిగింది. చంద్రబాబు, లోకేష్ ప్రచారానికి వచ్చినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు.

గంటా శ్రీనివాసరావు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోవడం ప్రధాన కారణమని నేతలు ఆరోపిస్తున్నారు. గంటా పై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన వల్లే విశాఖలో టీడీపీ తీవ్రంగా నష్టపోయిందని.. వెంటనే సాగనంపాలని డిమాండ్ ఊపందుకుంది.

ఈ మేరకు విశాఖ టీడీపీ నగర అధ్యక్షుడు పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోనే మెజారిటీ డివిజన్లను కోల్పోయామని ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ లో ఓటమి పాలు కావడానికి గంటాను బాధ్యుడిగా గుర్తించామని స్పష్టం చేశారు.

గంటా పార్టీలో కొనసాగితే మరింత దిగజారడం ఖాయమని.. ఆయనను సాగనంపాలని విశాఖ నేతలంతా కలిసి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది.