Begin typing your search above and press return to search.

అధ్యక్ష భవనంలో లూటీ జరిగిందా ?

By:  Tupaki Desk   |   24 July 2022 5:58 AM GMT
అధ్యక్ష భవనంలో లూటీ జరిగిందా ?
X
ఇపుడిదే విషయం ఉన్నతాధికారులను బాగా కలవర పెట్టేస్తోంది. ఇంతకీ అధ్యక్ష భవనం అంటే మన దగ్గర కాదులేండి. శ్రీలంక అధ్యక్ష భవనంలో లూటీ జరిగిందట. ఈమధ్య గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా దేశంలోని లక్షలాది మంది జనాలు రోడ్లపైకి వచ్చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా జనాలు తీవ్రమైన ఆందోళనలు చేసిన తర్వాత అన్ని వైపుల నుండి ఎదురైన ఒత్తిళ్ళకు తట్టుకోలేక చివరకు గొటబాయ కుటుంబంతో సహా దేశం విడిచిపారిపోయారు.

తన కుటుంబంతో సహా రాజపక్స అధ్యక్ష భవనం నుండి పారిపోయే ముందే జనాలు ఒక్కసారిగా అధ్యక్ష భవనం పైకి దాడిచేశారు. ఆ దాడుల నుండి తప్పించుకునేందుకే రాజపక్స కుటుంబంతో సహా పారిపోయారు. వందలాది మంది జనాలు కొద్దిరోజుల పాటు అధ్యక్ష భవనాన్ని ఆక్రమించుకుని అక్కడే ఉన్నారు. తర్వాత భద్రతా దళాలు జనాలందరినీ అధ్యక్ష భవనం నుండి ఖాళీ చేయించారు.

ఇపుడు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్న సెక్యూరిటి, ఉన్నతాధికారుల లెక్కల ప్రకారం భవనంలో నుండి విలువైన కళాఖండాలు మాయమైపోయాయట. భవనంలోని కళాఖండాలు, పురాతన వస్తువులు సుమారు వెయ్యివరకు కనబడటం లేదని ఉన్నతాధికారులంటున్నారు. మరి రోజుల తరబడి అధ్యక్షభవనంలోనే తిష్టవేసిన మామూలు జనాల్లో ఎవరు వీటిని పట్టుకుపోయారో తెలీటం లేదు. ఎందుకంటే అసలు అధ్యక్ష భవనంలో చారిత్రక, పురాతన వస్తువులు, కళాఖండాలు ఎన్ని ఉన్నాయనే లెక్క కూడా తమ దగ్గర లేదని ఉన్నతాధికారులు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

మామూలుగా అయితే అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి భవనాలతో పాటు మంత్రుల భవనాల్లో ఉపయోగిస్తున్న వస్తువుల జాబితాను మైన్ టైన్ చేయటానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. అలాంటిది శ్రీలంక అధ్యక్షభవనంలో లూటీజరిగిన కళాఖండాలు, పురాతన వస్తువుల జాబితాకు సరైన లెక్కలేదని అంటే ఇక ఎవరిని అనుమానిస్తారు ? అసలు లూటీ జరిగినట్లు ఎలా అనుమానించారు ? భవనాన్ని ఆక్రమించిన మామూలు జనాలే లూటీ చేసినట్లు ఆధారాలు ఏమున్నాయి ? దేశంవిడిచి పారిపోయిన రాజపక్స కుటుంబం కూడా విలువైన కళాఖండాలు, పురాతన వస్తువులను ఎత్తుకెళ్ళిపోయుండచ్చు కదా ?