Begin typing your search above and press return to search.

హత్రాస్ కేసులో ట్విస్ట్: బాలికను కుటుంబమే చంపేసింది

By:  Tupaki Desk   |   8 Oct 2020 12:05 PM GMT
హత్రాస్ కేసులో ట్విస్ట్: బాలికను కుటుంబమే చంపేసింది
X
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు తాజాగా జిల్లా ఎస్పీకి లేఖ రాయడం సంచలనమైంది.

హత్రాస్ బాలికపై రేప్ చేసి చంపారని నలుగురు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిప్పుడు జైల్లో ఉన్నారు. ఈ నలుగురు బుధవారం ఎస్పీకి లేఖ రాశారు. ఈ కేసులో తాము నిర్ధోషులమని.. తమను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని పేర్కొంటూ నిందితులు నలుగురు ఎస్పీకి లేఖ రాశారు.

హత్రాస్ బాలికను బాధిత యువతి కుటుంబ సభ్యులే హింసించి హత్య చేశారని కేసులో ప్రధాన నిందితుడు ఆరోపించాడు. తామిద్దరం స్నేహితులమని.. తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్లమని లేఖలో వివరించాడు. తమ స్నేహాన్ని యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని.. ఘటన జరిగిన రోజున తన స్నేహితురాలిని కలవడానికి ఊరు చివర పొలాల్లోకి వెళ్లానని.. అక్కడ ఆమె తల్లి, సోదరుడు కూడా ఉన్నారన్నారు. అక్కడి నుంచి తనను వెళ్లిపొమ్మని చెబితే ఇంటికి తిరిగివచ్చానని లేఖలో తెలిపాడు.

తనతో స్నేహం చేయడంపై ఆగ్రహించిన యువతి తల్లి, సోదరుడు ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశారని.. తమ నలుగురిపై నిరాధారమైన ఆరోపణలు చేసి జైలుకు పంపడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు. తమకు ఏ పాపం తెలియదని.. దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని లేఖలో కోరాడు.

అయితే నిందితుడు చేస్తున్న ఆరోపణలను బాధితురాలి తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు.తమ కుమార్తెను కోల్పోయామని.. ఇలాంటి నిందలు వేస్తున్నారని వాపోయాడు. ఈ ఆరోపణల్లో నిజం లేదని.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తాజాగా నిందితులు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో ఖండించారు. ఇవన్నీ కట్టుకథలు అని ఆరోపించారు. నేరం చేసి వారిపైనే నెపం వేస్తారని మండిపడ్డారు.