Begin typing your search above and press return to search.

నెల్లూరులో ఆ ఎమ్మెల్యేలకు హ్యాట్రిక్ ఛాన్స్...!

By:  Tupaki Desk   |   24 Jan 2022 10:40 AM GMT
నెల్లూరులో ఆ ఎమ్మెల్యేలకు హ్యాట్రిక్ ఛాన్స్...!
X
రాష్ట్రంలో రాజకీయం మారినా సరే నెల్లూరు జిల్లాలో మాత్రం రాజకీయం మారేలా కనిపించడం లేదు. నెల్లూరులో ఎప్పుడు వైసీపీ హవానే నడిచేలా ఉంది. ఒకవేళ రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా పరిస్థితులు ఏర్పడినా నెల్లూరు ప్రజలు మాత్రం వైసీపీ వైపే ఉండేలా ఉన్నారు. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా సరే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆధిక్యం తగ్గేలా లేదు. గత రెండు ఎన్నికల్లో కూడా అదే జరిగిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ రెండు, మూడు సీట్లలో మార్పులు రావొచ్చు గాని ..మొత్తం మీద అయితే నెల్లూరులో వైసీపీకే లీడ్ ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా ఉంటే, టీడీపీ నేతలు వీక్‌గా ఉన్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యేలు మరొకసారి గెలిచి సత్తా చాటేలా ఉన్నారు. అలా వరుసగా గెలుస్తూ...మరొకసారి కూడా సత్తా చాటాడానికి రెడీ అయిన వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

నెల్లూరు రూరల్‌లో వరుసగా రెండుసార్లు గెలిచిన కోటంరెడ్డి...మూడోసారి గెలవడం ఖాయమనే చెప్పొచ్చు. రూరల్‌లో కోటంరెడ్డి స్ట్రాంగ్‌గా ఉండటంతో టీడీపీకి ఛాన్స్ కనబడటం లేదు. ఆయ‌న హ్యాట్రిక్‌కు ఎలాంటి ఢోకా లేన‌ట్టే..! అలాగే కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి హ్యాట్రిక్ ఛాన్స్ కనిపిస్తోంది. కావలిలో టీడీపీకి ఏ మాత్రం బలం కనిపించడం లేదు. పైగా బీద‌మ‌స్తాన్ రావు వైసీపీలోకి వెళ్లిపోవ‌డం టీడీపీకి పెద్ద మైన‌స్‌. ఇక్క‌డ ఆయ‌న హ్యాట్రిక్ గెలుపు విష‌యంలో సందేహాలు అక్క‌ర్లేద‌న్న ప‌రిస్థితే అక్క‌డ ఉంది.

ఇక ఆత్మకూరులో మంత్రి గౌతమ్ రెడ్డి సైతం హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆత్మకూరులో టీడీపీకి సరైన నాయకుడే లేడు. దీంతో గౌతమ్‌కు తిరుగులేకుండా ఉంది. ఇక నెల్లూరు సిటీలో మంత్రి అనిల్‌కు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బలమైన టీడీపీ అభ్యర్ధి ఉంటే, అనిల్‌కు కష్టం అవుతుంది. అటు సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డికి హ్యాట్రిక్ ఛాన్స్ ఉంది. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుంజుకుంటార‌న్న ఆశ‌లు కూడా లేవు.

అటు నెల్లూరులో కిలివేటి సంజీవ‌య్య కూడా చాలా బ‌లంగా ఉన్నారు. ఏదేమైనా అద్భుతాలు జ‌రిగితే త‌ప్పా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ పుంజుకుంటుంద‌న్న ఆశ‌లు అయితే ఇప్ప‌ట‌కీ లేవు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.