Begin typing your search above and press return to search.

కిడ్నీ సమస్యలు ఉన్నాయా? అప్రమత్తత అవసరం!

By:  Tupaki Desk   |   27 May 2021 12:30 AM GMT
కిడ్నీ సమస్యలు ఉన్నాయా? అప్రమత్తత అవసరం!
X
కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. మొదటి దశ కన్నా రెండో దశలో దీని ప్రభావం అధికంగా ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు, ప్రధాన అవయవాల సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అతి సున్నితమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని నెఫ్రాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని చెబుతున్నారు. కిడ్నీ పనిచేయకపోవడం, డయాలసిస్, మూత్ర పిండాల మార్పిడి చేయించుకునే రోగులు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏడాది కాలంలో చాలామంది కిడ్నీల సమస్యల బారిన పడ్డట్లు వెల్లడించారు. వారికి చికిత్స, రవాణా వంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.

శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలపై కరోనా దాడి చేస్తోందని వారు పేర్కొన్నారు. అందుకే ఈ అవయవాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మిగతావారికన్నా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సొంత వైద్యాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. చిట్కాల రూపంలో కొత్త సమస్యలను తెచ్చుకోకూడదని అంటున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

జలుబు ఉండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ బాధితులు కనీసం మూడు నెలలకు సరిపడా మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఇంటి వద్దే ఉండి కొన్ని పరీక్షల ద్వారా కిడ్నీ పరిస్థితులను తెలుసుకోవాలని అంటున్నారు. పౌష్టికాహారం, నిద్ర, వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలని అన్నారు. కిడ్నీ బాధితుల కోసం జిల్లాల్లో ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.