Begin typing your search above and press return to search.

టీడీపీలో ఈ ప‌ది మందికి సీట్లు ఖ‌రారయ్యాయా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 5:12 AM GMT
టీడీపీలో ఈ ప‌ది మందికి సీట్లు ఖ‌రారయ్యాయా?
X
ప్ర‌స్తుతం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జుల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మీక్షలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. రోజూ ఆరేడు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జుల‌తో చంద్ర‌బాబు స‌మావేశ‌మ‌వుతున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాలు, ప్ర‌త్య‌ర్థి పార్టీల ప‌రిస్థితి, నియోజ‌క‌వ‌ర్గంలో సామాజిక స‌మీక‌ర‌ణాలు త‌దిత‌రాల గురించి చంద్రబాబు ఇన్‌చార్జుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను అప్ప‌టిక‌ప్పుడే చంద్ర‌బాబు ఖ‌రారు చేస్తున్నార‌ని చెబుతున్నారు. టీడీపీకి బాగా ప‌ట్టున్న కృష్ణా జిల్లాలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశార‌ని అంటున్నారు. అవ‌నిగ‌డ్డ నుంచి మాజీ మంత్రి మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్, పెన‌మలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్‌కు అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేశార‌ని తెలుస్తోంది. తాజాగా వారితో జ‌రిపిన స‌మీక్ష‌లో మీరే ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ని.. బాగా ప‌నిచేసుకోవాల‌ని సూచించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అలాగే ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఇన్‌చార్జి నారాయణ రెడ్డి, సంతనూతలపాడు ఇన్‌చార్జి విజయకుమార్‌ కూడా చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. వీరిద్దరికి కూడా సీట్లు ఖ‌రారు చేసిన‌ట్టు చెబుతున్నారు. అయితే అందరినీ కలుపుకొని వెళ్లాలని, కొంత మందికే దగ్గరగా ఉంటున్నారన్న నింద‌ను చెరిపేసుకోవాల‌ని వారిద్ద‌రికు సూచించార‌ని తెలుస్తోంది.

అదేవిధంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), చల్లా రామచంద్రారెడ్డి (పుంగనూరు), మహ్మద్‌ నజీర్‌ (గుంటూరు తూర్పు), బత్యాల చెంగల్రాయుడు (రాజంపేట), దామచర్ల జనార్దన్‌ (ఒంగోలు), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు)ల‌తో నిర్వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గాల భేటీలో మీరే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పార‌ని స‌మాచారం.

అయితే.. మైదుకూరు సీటుపై మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ చంద్రబాబు సుధాకర్‌ యాదవ్‌నే ఖరారుచేసినట్లు సమాచారం. కొందరు నేతలు సుధాక‌ర్ యాద‌వ్‌ను ప్రొద్దుటూరు మారిస్తే బాగుంటుందని సూచించిన‌ట్టు తెలిసింది. అయితే తాను వరుసగా రెండుసార్లు మైదుకూరు నుంచి పోటీచేసి ఓడిపోవడంతో నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి ఉందని, అందువ‌ల్ల ఇక్కడ పోటీ చేస్తేనే ఉప‌యోగం ఉంటుంద‌ని సుధాకర్ చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఏకీభవించార‌ని అంటున్నారు.

కాగా వీరిలో కొందరు ఇటీవల కొన్నికార్యక్రమాల అమల్లో వెనుకబడి ఉండడంపై చంద్ర‌బాబు వారిని హెచ్చ‌రించిన‌ట్టు చెబుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం అన్ని గ్రామాల్లో జరగకపోవడం, పార్టీ సభ్యత్వ నమోదులో వెనుక‌బ‌డి ఉండటం, ఓటర్ల జాబితా సవరణలను పట్టించుకోకపోవడంపై నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులకు చంద్ర‌బాబు ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు స‌మాచారం.