Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుపై వారికీ నమ్మకం పోయిందా?

By:  Tupaki Desk   |   1 Oct 2021 4:25 PM GMT
ఏపీ సర్కారుపై వారికీ నమ్మకం పోయిందా?
X
ఏపీ స‌ర్కార్‌కు వ‌రుస‌గా దెబ్బ‌మీద దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీ ఆర్థిక లోటుతో విల‌విల్లాడుతోంది. ప్ర‌భుత్వం న‌డ‌ప‌డానికి కూడా నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. చివ‌ర‌కు ప్రభుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చేందుకు కూడా ముప్పుతిప్ప‌లు ప‌డుతున్నారు. ఇక ఏపీ ప్ర‌భుత్వం నెల‌వారి అవ‌స‌రాల కోసం, ప్ర‌భుత్వ చెల్లింపుల కోసం కూడా మితిమీరిన అప్పులు, ఓవ‌ర్ డ్రాఫ్ట్ ల‌పై ఆధార ప‌డుతోంది. ఏపీ రుణ ప‌రిమితి పెరిగిపోవ‌డంతో అప్పులు పెంచుకోవ‌ద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న‌లు చేసినా కూడా ఏపీ ప్ర‌భుత్వం చేతులెత్తేస్తోంది.

చివ‌ర‌కు ఏపీలో ఆర్థిక ప‌రిస్థితి ఎంత‌కు దిగ‌జారింది అంటే ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించ‌డంతో పాటు నెల‌వారీ పెన్ష‌న్లు చెల్లించేందుకు కూడా మ‌రిన్ని అప్పులు చేస్తోంది. ఇక తాజాగా ఏపీలో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాలు ( సీఎస్ఎస్‌) అమ‌లు చేసేందుకు రు. 6500 కోట్ల ఓడీ సౌక‌ర్యంతో రుణం ఇవ్వాల‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగోలేనందున ప్ర‌భుత్వ ఐదు నోడ‌ల్ ఏజెన్సీల ద్వారా వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌ను వాడుకునేందుకే ఈ ఓడీ కోరింది.

ఈ క్ర‌మంలోనే ఏపీ ఫైనాన్స్ సెక్ర‌ట‌రీ కేవీవీ స‌త్య‌నారాయ‌ణ రు. 6500 కోట్ల ఓడీ ఇవ్వాల‌ని ఎస్‌బీఐకు లేఖ రాశారు. ఈ లేఖ‌పై ఆర్థిక మేథావులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఏ స్థాయికి దిగ‌జారిందో అనేందుకు ఇదే పెద్ద నిద‌ర్శ‌నం అని చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్ర‌తిపాద‌నను స్టేట్ బ్యాంక్ తిర‌స్క‌రించింది. ఇది ఏ మాత్రం సాధ్యంకాద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. ఈ ప‌రిస్థితి చూస్తుంటే చివ‌ర‌కు బ్యాంకుల‌కు సైతం ఏపీ ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం పోయిన‌ట్టే క‌నిపిస్తోంది.

తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక రంగం విష‌యంలో తీసుకుంటోన్న నిర్ణ‌యాలు కేంద్రానికి మ‌రింత చికాకు తెప్పిస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రోసారి ఇదే విష‌యంలో కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డంతో పాటు మ‌రిన్ని కొర్రీలు వేస్తుంద‌ని ఆర్థిక‌రంగ నిపుణులు లెక్క‌లు వేస్తున్నారు.