Begin typing your search above and press return to search.

బాంబే హైకోర్టు తాజా తీర్పు విన్నారా? తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు

By:  Tupaki Desk   |   20 March 2021 11:30 AM GMT
బాంబే హైకోర్టు తాజా తీర్పు విన్నారా? తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు
X
ఆసక్తికరమైన తీర్పును ఇచ్చింది బాంబే హైకోర్టు. తన తండ్రి చేసుకున్న రెండో పెళ్లిని ప్రశ్నించిన కుమార్తె.. తాను చేసిన న్యాయపోరాటంలో ఆమెకు ఊరట లభించింది. వివాహం అన్నది ఇద్దరు వ్యక్తులకే చెందినదే అని ఫ్యామిలీ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు పక్కన పెట్టింది. అంతేకాదు.. తండ్రి రెండో పెళ్లిని కోర్టులో ప్రశ్నించే అధికారం కుమార్తెకు ఉందని స్పష్టం చేసింది. ఇంతకీ ఈ తీర్పునకు కారణమైన అంశాల్లోకి వెళితే..

తన తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నిస్తూ ఒక మహిళ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. దీనికి కారణం లేకపోలేదు. 2003లో తన తల్లి మరణించిన తర్వాత ఆమె తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. 2016లో ఆయన మరణించారు. అయితే.. ఆమె సవితి తల్లి తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకున్నట్లుగా తేలింది.

అయితే.. తన తండ్రి ఆస్తులన్నింటిని సవితి తల్లి అనుభవిస్తున్న నేపథ్యంలో ఆమె పెళ్లి ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నిస్తూ ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు.అయితే.. ఫ్యామిలీ కోర్టు మాత్రం పెళ్లి అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదని.. దాని చెల్లుబాటును కుమార్తె ఎలా ప్రశ్నిస్తుందని కేసు కొట్టేశారు. దీనిపై అప్పీలుకు వెళ్లిన కుమార్తె వాదనను బాంబే హైకోర్టు సమర్థించింది. తండ్రిరెండో పెళ్లి చెల్లుబాటును హైకోర్టులో ప్రశ్నించే అధికారం ఉందని న్యాయస్థానం స్పష్టం చేయటంతో.. ఆమెకు ఊరట లభించినట్లైంది. అయినా మొదటి భర్త నుంచి చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవటం సరికాదని చెబుతున్నారు.