Begin typing your search above and press return to search.

గుజరాత్ నుంచి రూ.2 కోట్ల హవాలా డబ్బు.. రూపాయి చూపిస్తే ఇచ్చేస్తారు.?

By:  Tupaki Desk   |   13 Oct 2022 9:30 AM GMT
గుజరాత్ నుంచి రూ.2 కోట్ల హవాలా డబ్బు.. రూపాయి చూపిస్తే ఇచ్చేస్తారు.?
X
కొరియర్ చేస్తే ఏదైనా ఇంటికి చేరుతుంది. అందుకనే అన్నింటిని జనాలు కొరియర్ చేస్తుంటారు. కానీ ఇదో అక్రమ ఆదాయ మార్గం అని ఎవరికీ తెలియదు. రూపాయి నోటు చిత్రం వాట్సాప్ లో చూపితే ఏకంగా రూ.2 కోట్లు ఇవ్వాలి.. ఇదీ నయా దందా మరీ.. హైదరాబాద్ బంజారాహిల్స్ లో చిక్కిన రూ.2 కోట్ల నగదు మార్పిడికి ఎంచుకున్న మార్గం తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. కొరియర్ కార్యాలయం ముసుగులో డబ్బును ఇలా అక్రమంగా పంపుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 'ఆకాశ్ కాంతి కొరియర్ అండ్ పార్సిల్ సర్వీస్' కార్యాలయం సాక్షిగా ఈ భారీ దందా వెలుగుచూసింది.

హవాలా సొమ్ము రవాణా అవుతుందన్న సమాచారం మేరకు పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసి కార్యాలయం మొత్తం సోదా చేశారు. అక్కడే ఉన్న ఓ కారును పరిశీలించగా సీటు కింద డబ్బు దాచడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో రూ.2 కోట్ల నగడును పోలీసులు గుర్తించారు. కార్యాలయం ఇన్ చార్జి సహా డెలివరీ బాయ్ లు ఇద్దరు, కారు డ్రైవర్, ఓనర్ లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

ఈ కొరియర్ సర్వీస్ ను గుజరాత్ కు చెందిన.. బంజారాహిల్స్ లో నివసించే ఆకాశ్ కాంతిది అని తేలింది. అతడు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. గుజరాత్ కు చెందిన అజిద్ దాకర్ అనే వ్యక్తి సూచనల మేరకు హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో ఈ డబ్బును గుజరాత్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రూ.2 కోట్ల నగదు తీసుకోవడానికి వివేక్ అనే వ్యక్తి రావాల్సి ఉంది. ఆకాశ్ కాంతి కొరియర్స్ నిర్వాహకుడు డబ్బుసిద్ధం చేసి కారులో పెట్టాడు. వివేక్ రావడానికి ముందే పోలీసులు చేరుకొని సీజ్ చేసి అరెస్ట్ చేశారు. వివేక్ ఎవరు అన్నది సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంత పెద్దమొత్తంలో డబ్బును కేవలం ఒక రూపాయి నోటు ఆధారంగా హవాలా డబ్బు మార్పిడి చేస్తున్నట్టు తెలిసింది. సినిమాల్లో చూపించినట్టు వివేక్ కు ముందుగా పంపిన రూపాయి నోటు..దానిపై ఉన్న నంబర్ చూపిస్తే ఈ హవాలా డబ్బును అతడికి స్వాధీనం చేస్తారు. స్వాధీనం చేసుకున్న డబ్బులో వివేక్ కు వాట్సాప్ లో పంపిన రూపాయి నోటు సైతం ఉంది.

ఈ డబ్బు గుజరాత్ కు వెళుతోందా? లేక మునుగోడు ఉప ఎన్నికకా అన్నది పోలీసులు ఆరాతీస్తున్నారు. గుజరాత్ నుంచి రావడంతో ఇది ఓ పార్టీకి చెందినదా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.