Begin typing your search above and press return to search.

కీలక మార్పు.. నెట్ లేకున్నా హాక్-ఐ పని చేస్తుంది

By:  Tupaki Desk   |   5 Dec 2019 4:16 AM GMT
కీలక మార్పు.. నెట్ లేకున్నా హాక్-ఐ పని చేస్తుంది
X
దిశ ఉదంతం నేపథ్యంలో మహిళల భద్రత మీద మరోసారి భారీ చర్చ మొదలైంది. ఇలాంటివేళ.. మహిళలకు రక్షణ కల్పించేందుకు తాము తీసుకుంటున్న చర్యలపై పోలీసులు అదే పనిగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. సమస్య ఏదైనా డయల్ 100కు ఫోన్ చేయండని ప్రచారం చేస్తున్నారు. ఆపత్ కాలంలో డయల్ 100కు ఫోన్ చేయటాన్ని అస్సలు మర్చిపోవద్దని చెప్పటంతో పాటు.. హ్యాక్ -ఐ మొబైల్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రతి స్మార్ట్ ఫోన్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు.

దిశ ఉదంతం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హాక్ -ఐ డౌన్ లోడ్ల సంఖ్య భారీ ఎత్తున పెరిగాయి. ఈ అప్లికేషన్ ను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలుగా కొత్త సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొబైల్ డేటా ఆన్ లో లేకున్నా.. డేటా అందుబాటులో లేని సమయంలోనూ హాక్ -ఐను వినియోగించుకునేలా మార్పులు చేశారు.

తాజాగా అప్ డేటెడ్ చేసిన వెర్షన్ బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. మొబైల్ డేటా లేని వేళలో హ్యాక్ - ఐలో ఉన్న ఎస్ఓఎస్ బటన్ నొక్కితే అది ఫోన్ కాల్ గా మారి డయల్ 100కు చేరుతుందని చెబుతున్నారు. ఆ వెంటనే అక్కడి సిబ్బంది బాధితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సమాచారం అందిస్తుంది. ప్రతి గస్తీ వాహనానికి జీపీఎస్ కనెక్టివిటీ ఉండటంతో బాధితులు ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న వారు స్పందించేలా సదరు ఫోన్ కాల్ ను డైవర్ట్ చేస్తారని చెబుతున్నారు. తాజా ఫీచర్ మరింత మేలు చేయటం ఖాయమంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ హాక్ - ఐ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసి వినియోగించటం మంచిదని పేర్కొంటున్నారు. ఇక.. ఆలస్యమెందుకు?