Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: పది పరీక్షలు వాయిదా వేయాలన్న హైకోర్టు

By:  Tupaki Desk   |   20 March 2020 10:00 AM GMT
బ్రేకింగ్: పది పరీక్షలు వాయిదా వేయాలన్న హైకోర్టు
X
కరోనా నేపథ్యం లో ప్రగతి భవన్ లో గురువారం అత్యవసర భేటీ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఎప్పటిలానే గంటల పాటు రివ్యూ చేసి.. చివరకు తామేం నిర్ణయాలు తీసుకున్నామన్న విషయాన్ని మీడియాకు చెప్పేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్ని వాయిదా వేయాలన్న అంశం మీద మాత్రం నో చెప్పేశారు. పరీక్షల్ని వాయిదా వేస్తే.. పిల్లల మూడ్ ఖరాబు అవుతుందని.. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఇదే సందర్భంలో తాము కొందరిని పరీక్షల వాయిదా మీద సర్వే చేయిస్తే.. చాలామంది పరీక్షల్ని కంటిన్యూ చేయాలని చెప్పారని.. అందుకే ఏడెనిమిది రోజుల్లో పరీక్షల్ని ముగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆసక్తికర ఆదేశాల్ని జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల్ని వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం జరగాల్సిన పరీక్షను జరిపి.. సోమవారం నుంచి జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేయాలని కోరింది.

ఈ నెల 30 వరకు జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేయాలని చెప్పింది. పరీక్షల నిర్వహణ మీద ఈ నెల 29న అత్యున్నత స్థాయి సమావేశాన్నినిర్వహించి తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా పేర్కొంది. పదో తరగతి పరీక్షల్ని నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై కసరత్తు చేసి.. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత.. హైకోర్టు అందుకు భిన్నమైన ఆదేశాల్ని జారీ చేసిన వైనం పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో..?