Begin typing your search above and press return to search.

కేసీఆర్ మ‌ళ్లీ అదే షాక్‌

By:  Tupaki Desk   |   14 Nov 2015 9:10 AM GMT
కేసీఆర్ మ‌ళ్లీ అదే షాక్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు - ఉమ్మ‌డి హైకోర్టుకు మ‌ధ్య విడ‌దీయ‌లేని బంధం ఉన్న‌ట్లుంది. కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యం వివాదాస్పదం అవ‌డం...అవి కోర్టు గుమ్మం తొక్క‌డం...అనంత‌రం కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా తీర్పు రావ‌డం వంటివి ష‌రామామూలుగా జ‌రిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్‌ కు తాజాగా మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది.

బేగంపేటలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వాస్తు స‌మ‌స్య ఉంద‌ని భావించిన సీఎం కేసీఆర్ ఆ నివాసంపై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో భ‌వ‌నాన్ని మార్చేందుకు పక్కన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్థ‌లం తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో దీనిపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మయ్యాయి. అసోసియేష‌న్ భ‌వనం వారసత్వ కట్టడమ‌ని పేర్కొంటూ ప‌లువ‌రు కోర్టుకు వెళ్లారు. దీంతో మ‌ళ్లీ పీఠ‌ముడి ప‌డింది.

ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భ‌వ‌నం వారసత్వ కట్టడమ‌ని, ఆ భవనం కూల్చివేత నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ది ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేసింది.

ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనాన్ని వారసత్వ కట్టడంగా ప్రకటిస్తూ ఏప్రిల్ 22, 2006లో నోటిఫికేషన్ విడుదల అయిందని పిటిషన్‌ దారు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారసత్వ కట్టడాన్ని కూల్చివేయడానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ నుంచి అనుమతి తప్పనిసరి అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ భవనాన్ని కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జూలై 13, 2015 ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్‌ దారు త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు.

ఈ సంద‌ర్భంగా కోర్టు సందేహాలు వ్య‌క్తం చేసింది. భవనం కూల్చివేత నిర్ణయంపై ఐఏఎస్ అధికారులు ఎవరూ కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ భవనాన్ని ఇప్పటికే అసొసియేషన్ ఖాళీ చేసిందని, అయినప్పటికీ వారసత్వ కట్టడాన్ని పరిరక్షించేందుకు ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ న్యాయపోరాటం చేస్తోందని పేర్కొంది. భవనం కూల్చివేతపై యధాతథ స్థితిని కొనసాగిస్తూ ప్రస్తుత స్థితిపై ఫోటోలతో సహా కోర్టుకు నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి భోంస్లే ప్రభుత్వాన్ని ఆదేశించారు. త‌క్కువ గ‌డువు ఇస్తూ తెలంగాణ ప్ర‌భుత్వానికి నోటీసు హైకోర్టు జారీచేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.