Begin typing your search above and press return to search.

పోలీసులు సమ్మె చేస్తే సర్కారు కూలిపోతుందట

By:  Tupaki Desk   |   19 Aug 2016 4:49 AM GMT
పోలీసులు సమ్మె చేస్తే సర్కారు కూలిపోతుందట
X
దేశంలో మరెక్కడా లేని విధంగా పోలీసుల సమ్మెకు పోలీసు మహా సంఘం అధ్యక్షుడు పిలుపునివ్వటం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఆయన స్టేట్ మెంట్ తో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయటమే కాదు.. దేశద్రోహం కేసు పెట్టి ఆయన్ను జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసిన కర్ణాటక పోలీసు మహా సంఘం అధ్యక్షుడు శశిధర్ కేసును కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి వేసిన సూటి ప్రశ్నలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

పోలీసులు సమ్మె చేస్తే ప్రభుత్వం కూలిపోతుందా? అసలు ఏ ఆధారాలతో శశిధర్ పై దేశద్రోహ నేరం నమోదు చేశారు? అంటూ ప్రశ్నించిన హైకోర్టు.. శశిధర్ న్యాయవాదిని సైతం పలు ప్రశ్నలు సంధించారు. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వటం మీకే ఓకేనా? సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించటంతోపాటు.. ఇంటర్వ్యూలు లాంటివి ఇవ్వకూడదన్న షరతులు పెడితే మీకు అభ్యంతరం లేదు కదా? అని ప్రశ్నించారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న మాటను పోలీసు మహా సంగం అధ్యక్షుడి తరపు లాయర్ స్పష్టం చేశారు. సమ్మె ప్రకటన చేయటం ద్వారా.. పోలీసుల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారంటూ కర్ణాటక ఆడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నణ్ణు పాయింట్ తీస్తూ.. బెయిల్ మంజూరు చేయకూడదని కోరారు. దీనికి రియాక్ట్ అయిన హైకోర్టు.. పోలీసుల సమ్మెతోనే సర్కారు కూలిపోతుందా? అన్న సూటి ప్రశ్నను సంధించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పని ఆడిషనల్ అడ్వకేట్ జనరల్ మౌనంగా ఉండిపోయారు. పోలీసు మహా సంఘం అధ్యక్షుడు బెయిల్ పిటీషన్ పై తీర్పును రిజర్వ్ చేశారు. అసలు పోలీసులు సమ్మె చేసే వరకే విషయాన్ని తీసుకురాకూడదు. ఒకవేళ విషయం అక్కడికే వస్తే.. వారి సమ్మె ప్రకటనలో లోపాల్ని తెర మీదకు తీసుకురావాలే తప్పించి.. సమ్మెతో సర్కారు కూలిపోతుందన్న మాటను చెప్పి అడ్డంగా బుక్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.