Begin typing your search above and press return to search.

హెచ్‌సీఏ రాజ‌కీయంః అసోసియేష‌న్ ఆలౌట్‌!

By:  Tupaki Desk   |   5 July 2021 10:30 AM GMT
హెచ్‌సీఏ రాజ‌కీయంః అసోసియేష‌న్ ఆలౌట్‌!
X
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఆట‌గాళ్లు ఎందురు? అంటే.. ఆలోచించి, గ‌ర్తు తెచ్చుకొని మ‌రీ కౌంట్ చెప్పాల్సిన ప‌రిస్థితి. ఆ లెక్క చూస్తే.. ఒక్క చేతివేళ్లు కూడా పూర్తికావు. మ‌రి, ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? రాష్ట్రంలో మెరుగైన‌ క్రీడాకారులను త‌యారు చేయ‌డం ఎలా? వారి సౌకర్యాల మాటేమిటి? అనే కీల‌క విష‌యాల‌ను చూడ‌డం హెచ్‌సీఏ ఎప్పుడో వ‌దిలేసింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. కేవ‌లం.. బోర్డు అధ్య‌క్షుడిగా, స‌భ్యులుగా హోదా చూపించుకోవ‌డానికి త‌ప్ప‌, అస‌లు క్రికెట్ గురించి వీరు మ‌న‌సు పెట్టింది లేనే లేద‌న్న‌ది ప‌రిశీల‌కుల అభిప్రాయం.

మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న ఆద‌ర‌ణ ఏ పాటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ క్రికెట్ ప్రేమికుల్లో భార‌త్ ఫ్యాన్స్ అగ్ర‌స్థానంలో ఉంటార‌ని చెప్పొచ్చు. క్రికెట్ ను ఇక్క‌డి అభిమానులు ఓ మ‌తంగా ఆరాధిస్తుంటార‌ని కూడా అంటారు. మ‌రి, ఆ క్రికెట్లో తెలుగు ఆట‌గాళ్ల ముద్ర ఎంత‌? మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యే ఆట‌గాళ్ల‌లో.. తెలుగు ప్లేయ‌ర్ల షేర్ ఎంత అన్న‌ప్పుడు.. అన్ని రాష్ట్రాల‌ను లెక్క‌లోకి తీసుకొని, కింది నుంచి కౌంట్ చేసుకుంటూ పోవాల్సిన ప‌రిస్థితి.

ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉన్న‌ప్ప‌టికీ.. హైద‌రాబాద్ క్రికెట్ సంఘం మాత్రం ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌ట్టించుకోవ‌ట్లేదు అన‌డం క‌న్నా.. వారికి స‌మ‌యం లేద‌ని అంటే బాగుంటుందని అంటున్నారు. అవును మ‌రి.. నిత్యం గ్రూపు రాజ‌కీయాలు న‌డుపుకుంటూ.. ఎప్పుడు ఎవ‌రిని ప‌క్కకు త‌ప్పిద్దామా? అని ఆలోచించుకుంటూ కూర్చునేవారికి క్రికెట్ డెవ‌ల‌ప్ మెంట్ గురించి ఆలోచించ‌డానికి స‌మ‌యం ఎక్క‌డ ఉంటుంది? అని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు స‌గ‌టు క్రికెట్ ప్రేమికులు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్లో ఏం జ‌రుగుతోందో చూద్దాం. మాజీ టీమిండియా కెప్టెన్ అజహారుద్దీన్ హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆయ‌న‌పై మ్యాచ్ ఫిక్సింగ్ విమ‌ర్శ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. బీసీసీఐ నుంచి నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఆయ‌న హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా ఉండ‌డాన్ని కొంద‌రు వ్య‌తిరేకించారు. మ‌రి, ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇచ్చిందో.. మ‌రోవిధంగా చ‌క్రం తిప్పారోగానీ.. మొత్తానికి అధ్య‌క్ష ప‌ద‌వి సాధించారు.

అయితే.. అప్ప‌టి నుంచి కొన‌సాగుతున్న వివాదాలు.. ఇప్పుడు తార‌స్థాయికి చేరాయి. ఇటీవ‌ల ఏకంగా ఆయ‌న్ను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ.. అపెక్స్ కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో ఉన్న కేసుల‌ను ఇందుకు కార‌ణంగా చూపించింది. అయితే.. గ‌తంలోనే అంబుడ్స్ మ‌న్ ను నియ‌మించారు అజ‌హారుద్దీన్‌. జ‌స్టిస్ దీప‌క్ వ‌ర్మ‌ను అంబుడ్స్ మ‌న్ గా నియ‌మించారు. ఈయ‌న అజ‌హ‌రుద్దీన్ స‌న్నిహితులే.

త‌న‌ను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డాన్ని స‌వాల్ చేస్తూ.. అంబుడ్స్ మ‌న్ కు కంప్లైంట్ చేశారు అజ‌హ‌ర్‌. దీంతో.. అస‌లు అపెక్స్ కౌన్సిలే లేకుండా ర‌ద్దు చేశారు అంబుడ్స్ మ‌న్‌. పాల‌నా వ్య‌వ‌హారాలు మొద‌లు అన్నీ అధ్య‌క్షుడే చూసుకుంటార‌ని ప్ర‌క‌టించారు. అయితే.. అపెక్స్ కౌన్సిల్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ.. ఈ కౌన్సిల్ ను ర‌ద్దు చేసే అధికారం అంబుద్స్ మ‌న‌కు లేదు అని అంటోంది. అంతేకాదు.. అస‌లు అంబుడ్స్ మ‌న్ నియామ‌క‌మే చెల్ల‌ద‌ని వాదిస్తోంది అపెక్స్ కౌన్సిల్‌.

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్లో రాజ‌కీయాలు ఏ స్థాయిలో జ‌రుగుతున్నాయో.. ఈ ఉదంతం చూస్తే ఎవ్వ‌రికైనా అర్థ‌మైపోతుంది. ఇలాంటి పాల‌క వ‌ర్గాల‌ను పెట్టుకొని హెచ్‌సీఏ ఎలాంటి పురోగ‌తి సాధిస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. ఈ ప‌నికిమాలిన రాజ‌కీయాల వ‌ల్ల‌నే జాతీయ‌స్థాయిలో హెచ్‌సీఏ అభాసుపాలవుతోంద‌ని అంటున్నారు. మ‌రి, ఈ వ్య‌వ‌హారం ఏ తీరానికి చేరుతుందో చూడాలి.