Begin typing your search above and press return to search.

హెచ్‌ సీయూః రోహిత్ విగ్ర‌హం తొల‌గింపు

By:  Tupaki Desk   |   5 April 2016 12:03 PM GMT
హెచ్‌ సీయూః రోహిత్ విగ్ర‌హం తొల‌గింపు
X
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్ధి ఉద్యమాలను నియంత్రించేందుకు పాల‌కవ‌ర్గం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మొదలుపెట్టింది. వ‌ర్సిటీని గాడిలో పెట్టేందుకు భ‌ద్ర‌త కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సిఐఎస్‌ ఎఫ్)ను నియమించాలని వర్శిటీ పాలకులు నిర్ణయించారు. సీఐఎస్‌ ఎఫ్‌ ను నియమించే వరకూ ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని పటిష్ఠం చేయాలని, అవసరమైతే మహిళా పోలీసులను సైతం నియమించాలని ఇటీవల జరిగిన డీన్‌ లు - డైరెక్టర్ల సమావేశం నిర్ణయించింది. క్యాంపస్ అంతా సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయడం, విద్యార్ధులకు స్వైపింగ్ కార్డులు జారీ చేయడం చర్యలను చేపట్టాలని నిర్ణయించారు.

క్యాంపస్‌ లోకి మీడియా రావడం వల్ల రచ్చ ఎక్కువ అవుతోందని, పాజిటివ్ వార్తలకు కాకుండా నెగిటివ్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఈ క‌మిటీ స‌మావేశం అభిప్రాయపడింది. దీంతో మీడియాను ఎట్టి పరిస్థితిలో ఏ రూపంలోనూ క్యాంపస్ లోపలికి రానివ్వరాదని నిర్ణయించింది. మార్చి 22 - 23 తేదీల్లో మీడియాను క్యాంపస్‌ లోకి రానివ్వకుండా అడ్డుకోవడం సత్ఫలితాలనే ఇచ్చిందని సమావేశం అభిప్రాయపడింది. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన రోహిత్ విగ్రహాన్ని తొలగించాలని కూడా నిర్ణయించింది. రోహిత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌ కు దానిని తొలగించాలని నోటీసు ఇవ్వాలని, అది ఫలించకపోతే పోలీసుల సహకారంతో విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించింది. రానున్న రోజుల్లో ఒక అంబుడ్స్‌ మన్‌ ను, ఒక అధికారిని కూడా నియమించాలని నిర్ణయించారు.