Begin typing your search above and press return to search.

కుమారస్వామికి సోమవారానికి సాకు దొరికిందా?

By:  Tupaki Desk   |   21 July 2019 4:54 PM GMT
కుమారస్వామికి సోమవారానికి సాకు దొరికిందా?
X
తమ అధికార కాలాన్ని మరో రోజు పొడిగించేందుకు కుమారస్వామి అండ్ కంపెనీకి మరో కాజ్ దొరికిందనే మాట వినిపిస్తోంది. సోమవారం రోజున సభలో విశ్వాస పరీక్ష విషయంలో ఓటింగ్ జరగకుండా చూసేందుకు ప్రభుత్వం దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయని తెలుస్తోంది. వాటి ప్రస్తావన ద్వారా సభలో బలపరీక్షను సోమవారం జరపాల్సిన అవసరం లేకుండా చూసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.

అందులో ఒకటి వాయిదా. ఇప్పటి వరకూ విశ్వాస పరీక్ష పై చర్చ అంటూ సోమవారానికి లాక్కొచ్చారు. సోమవారం కూడా సభలో ఆ చర్చే జరుగుతుందని ప్రకటించారు. అయితే సోమవారం రోజున ఒక సంతాప తీర్మానం అనంతరం, సభ వాయిదా పడొచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణించిన నేపథ్యంలో ఆమెకు కర్ణాటక అసెంబ్లీ నివాళి అర్పించవచ్చు. ఆమెకు నివాళిగా సభను ఒక రోజు పాటు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే సోమవారం విశ్వాస పరీక్ష లేనట్టే!

అంతే కాదట.. వినియోగించుకుంటే సంకీర్ణ సర్కారుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని సమాచారం. విశ్వాస పరీక్ష విషయంలో పలు అంశాలు సుప్రీం కోర్టులో ఉన్నాయి. విశ్వాస పరీక్ష సమయంలో రెబెల్ ఎమ్మెల్యేలను సభకు హాజరయ్యేలా చేయడానికి విప్ జారీ చేసే అధికారాన్ని కాంగ్రెస్ వాళ్లు కోర్టు ద్వారా సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను సభకు హాజరు కావాలని తాము బలవంత పెట్టలేమని కోర్టు చెప్పింది. అయితే విప్ జారీ చేసి, ఎమ్మెల్యేలను సభకు తీసుకెళ్లే అధికారం తమకు ఉందని.. ఆ విషయం గురించి చెప్పాలని సుప్రీం కోర్టును అధికార పక్షం కోరుతోంది. దానిపై సోమవారం విచారణ జరగనుంది.

కాబట్టి ఆ అంశం మీద తీర్పు వచ్చే వరకూ ఓటింగ్ వద్దని స్పీకర్ నిర్ణయించవచ్చని అంటున్నారు. అలా సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ కూడా కుమారసర్కారుకు సోమవారం గండం నుంచి గట్టెక్కించేందుకు ఉపయోగపడనుందని విశ్లేషకులు అంటున్నారు.